- అభ్యర్థుల జాబితా ప్రకటించిన టీవీకే చీఫ్
చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల అరంగేట్రంపై ఉత్కంఠకు తెర పడింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. డీఎంకే కంచుకోటగా భావించే చెన్నైలోని పెరంబూర్‌తో పాటు, సెంట్రల్ తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు.
చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన 234 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ పలు ఆకర్షణీయ హామీలను ప్రకటించారు. 29 ఏండ్లు నిండిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.2,500 చొప్పున ‘యూత్ వెల్ఫేర్ ఫండ్’ కింద ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు.
12వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణం అందిస్తామని ప్రకటించారు. ‘త్రాట’ (టీఆర్ఏటీఏ) చట్టం ద్వారా ఏడాది పొడవునా పక్కాగా ఉద్యోగ క్యాలెండర్‌ను అమలు చేస్తామని చెప్పారు. అవినీతి లేని, ప్రజల కోసం నిలబడే అభ్యర్థులనే తాను ఎంపిక చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలందరూ తమకు ఒక అవకాశం ఇచ్చి, విజిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
