సిడ్నీ: ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో తన్వీ 21–12, 22–20తో ఐదోసీడ్ చియు పిన్ చైన్ (చైనీస్‌తైపీ)పై గెలిచింది. 45 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా కీలక టైమ్‌లో ర్యాలీలతో చెక్ పెట్టింది.
తొలి గేమ్‌లో 5–5 స్కోరు తర్వాత తన్వీ వెనుదిరిగి చూసుకోలేదు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న చైన్ 10–10, 17–17తో స్కోరు సమం చేసింది. ఈ దశలో ఒక్కో పాయింట్‌తో ఇద్దరూ హోరాహోరీగా పోటీపడ్డారు. చివరకు 20–20 వద్ద తన్వీ రెండు స్మాష్‌లతో గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఇతర మ్యాచ్‌ల్లో పీవీ సింధు 21–13, 21–11తో ఇనెస్ లూసియా కాస్టిలో (పెరూ)పై, తన్యా హేమంత్ 21–17, 21–18తో ఇషికా జైస్వాల్ (అమెరికా)పై, మాళవిక బన్సోద్ 15–21, 21–7, 21–13తో టోన్‌రుంగ్ సెహాంగ్ (థాయ్‌లాండ్)పై, ఇషారాణి 22–20, 10–21, 21–14తో హన్ జియాన్ జి (చైనా)పై గెలవగా, ఆకర్షి కశ్యప్ 19–21, 21–19, 20–22తో వాంగ్ లింగ్ చింగ్ (మలేసియా) చేతిలో ఓడింది.
మెన్స్ సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 19–21, 21–14, 15–21తో జస్టిన్ హోహ్ (అమెరికా) చేతిలో, తరుణ్ మన్నెపల్లి 21–18, 13–21, 23–25తో లిన్ చున్ యి (చైనీస్‌తైపీ) చేతిలో, సనీత్ దయానంద్ 8–21, 10–21తో హు జా అన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ రావత్–మనీషా 21–13, 21–14తో జైడెన్ లిమ్–విక్టోరియా జొనాది (ఆస్ట్రేలియా)పై నెగ్గగా, మోహిత్ జగ్లాన్–లక్షిత్ జగ్లాన్ 6–21, 5–21తో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) చేతిలో కంగుతిన్నారు.
