రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పబ్బులు, శివారులో ఉన్న రిసార్టులలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోతున్నాయి. సమయం దాటిన తర్వాత కూడా పబ్బులను తెరిచి ఉంచుతున్నారు. డ్రగ్స్ వినియోగిస్తూ.. అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇటీవలే ‘ఫుడింగ్ అండ్ మింక్ పబ్’ ఉదంతం సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. అయినా.. కూడా కొంతమంది పబ్ ల వైఖరిలో మార్పు రావడం లేదు. తాజాగా.. హైదరాబాద్ రాంగోపాల్ పేట్‌లోని టకీల పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే అక్కడకు చేరుకుని దాడులు నిర్వహించారు. అప్పటికే అక్కడున్న 18 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ ఆర్గనైజర్ తో పాటు 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, మరో ఎనిమిది మంది డ్యాన్స్ లు చేసే యువతులను అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. వీరిని రాంగోపాల్ పేట్ పోలీసులకు అప్పగించారు.
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మాయిలతో నిర్వాహకులు డ్యాన్సులు చేస్తున్నట్లు తేలింది. దీంతో పబ్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 294, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు 41 CRPC నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. గతంలో కూడా టకీల బార్ అండ్ రెస్టారెంట్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17వ తేదీ తెల్లవారుజామున ఫుడింగ్ పబ్ లో పోలీసులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఇందులో 150 మందికి పైగా పట్టుబడ్డారు. సినీ, రాజకీయ ప్రముఖులున్నట్లు వచ్చిన వార్తలు సంచలనం రేకేత్తించాయి. పబ్ లో 4.6 గ్రాముల కొకైన్ లభించింది. పబ్ యజమాని అభిషేక్ తో పాటు మేనేజర్ అనిల్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని వార్తల కోసం : -
34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. వివరాలు
2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు
