దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఐటీ స్టాక్స్ భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3.7 శాతం పతనమై.. మే 2023 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. ప్రధానంగా AI రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, గ్లోబల్ పరిణామాలు ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.
భారీ పతనానికి ప్రధాన కారణం ప్రముఖ ఏఐ సంస్థ OpenAI తీసుకున్న ఒక కీలక నిర్ణయం. సుమారు రూ.33వేల 500 కోట్ల పెట్టుబడితో కంపెనీలకు ఏఐ సేవలను నేరుగా అందించేందుకు ఒక కొత్త సంస్థను ప్రారంభిస్తున్నట్లు OpenAI ప్రకటించింది. దీనివల్ల సాంప్రదాయ ఐటీ సేవల అవసరం తగ్గిపోతుందనే భయం మార్కెట్‌లో మొదలైంది. OpenAI ఇంజనీర్లు నేరుగా క్లయింట్ సంస్థల్లో ఉండి ఏఐ వ్యవస్థలను రూపొందిస్తారని తెలియడంతో.. భారతీయ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్‌కు ఇది పెద్ద ముప్పుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ లాంటి కంపెనీల వ్యాపారాన్ని ఓపెన్ ఏఐ దక్కించుకుంటుందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
►ALSO READ | LPG కస్టమర్లకు అలర్ట్: 7 రోజుల్లో స్పందించకపోతే మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రద్దు! కొత్త రూల్స్ ఇవే
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ HSBC విడుదల చేసిన రిపోర్ట్ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను అందుకోలేకపోవడం, సాంప్రదాయ ఐటీ సేవల కంటే ఏఐ ప్రాజెక్టులకే ప్రపంచ వ్యాప్తంగా క్లయింట్స్ మొగ్గు చూపుతుండటం భారత ఐటీ రంగానికి సవాలుగా మారింది. దీనికి తోడు అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో నెలకొన్న అనిశ్చితి కూడా ఐటీ షేర్లపై ఒత్తిడి పెంచింది. అమెరికా నుంచి సుమారు 57 శాతం ఆదాయాన్ని పొందే భారత ఐటీ రంగానికి అక్కడ వడ్డీ రేట్లు పెరిగితే లేదా తగ్గకపోతే క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్‌ను తగ్గించుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్రాడే మార్కెట్ అమ్మకాల్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్ అత్యధికంగా 5 శాతం నష్టపోగా, టీసీఎస్, ఎల్టీఐమైండ్‌ట్రీ వంటి దిగ్గజాలు సుమారు 4 శాతం వరకు నష్టపోయాయి. ఇక ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ కంపెనీలు కూడా 2 నుండి 4 శాతం మేర నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటం.. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే అంచనాలు ఐటీ రంగ పతనానికి మరింత ఆజ్యం పోశాయి. రానున్న రోజుల్లో పెద్దపెద్ద ఐటీ సేవల కంపెనీల ప్రాముఖ్యత తగ్గుతుందని ఇది నిరూపిస్తోంది.
