- విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి
ముంబై: టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్చార్ మేనేజర్ నిదా ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిదా ఖాన్.. నాసిక్‌లోని స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసింది. తాను ప్రస్తుతం గర్భంతో ఉన్నానని, కోర్టు విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. తన మెడికల్ కండిషన్‌ను దృష్టిలో ఉంచుకుని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఆమె అభ్యర్థనలను అధికారులు వెరిఫై చేయాల్సి ఉంది. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న నిదా ఖాన్ ప్రస్తుతం ఆమె ముంబైలో ఉందని సమాచారం. నిదాను కస్టడీలోకి తీసుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2021లో నాసిక్ లోని టీసీఎస్ బీపీఓ యూనిట్ లో నిదా చేరింది. ప్రస్తుతం హెచ్ఆర్ మేనేజర్ గా కొనసాగుతోంది. ఇక మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు వారిని బలవంతంగా మతమార్పిళ్లు చేశారన్న ఆరోపణలపై మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో హెచ్ఆర్ హెడ్ అశ్విని చైనానీ కూడా ఉన్నారు.
అంతా స్క్రిప్ట్ ప్రకారం చేశారు..
టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్లో మతమార్పిళ్లు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తమ వారిపై తప్పుడు కేసులు నమోదు చేశారని, అంతా స్ర్కిప్టు ప్రకారం చేశారని ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న తౌసిఫ్ అత్తార్, రజా మీమన్ కుటుంబ సభ్యులు అన్నారు. శుక్రవారం రజా బంధువు రజాక్ కాజీ.. మీడియాతో మాట్లాడారు.
ఈ కేసులో బజరంగ్ దళ్ జోక్యం చేసుకుందని ఆరోపించారు. తౌసిఫ్ తండ్రి బిలాల్ ఫకీర్ అత్తార్ మాట్లాడుతూ తమది విద్యావంతుల కుటుంబమని చెప్పారు. తన కొడుకుతో పాటు మిగతా వారిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు.

