- టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లపై ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ)పేరుతో అదనపు ఆర్థిక భారం మోపొద్దని ప్రభుత్వాన్ని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీని అమలు చేసిన తర్వాతే హెల్త్ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వాటాను వసూలు చేయాలని, అంతవరకు ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య, ఆర్గనైజేషన్ కార్యదర్శి హన్మంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈహెచ్‌సీటీ అమలుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ వెంటనే పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ, యూఆర్‌ఎస్, గిరిజన ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లందరికీ, సిబ్బందికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కొమరయ్య డిమాండ్ చేశారు. హెల్త్ ట్రస్ట్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించబోమని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలన్నారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యంతో పాటు ఓపీ సేవలు అందేలా పారదర్శక ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని, అత్యవసర సేవల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో 2003 డీఎస్సీ టీచర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్సీ కోరారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏ లను విడుదల చేయడంతో పాటు పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. సర్కారు విడుదల చేశామంటున్న రూ.2వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొమరయ్య డిమాండ్ చేశారు.
