టీఆర్ఎస్ లో మొదలైన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల భయం

టీఆర్ఎస్ లో మొదలైన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల భయం
  • టీఆర్ఎస్​లో ఇంకా రాని క్లారిటీ 
  • పార్టీ మద్దతు కోరుతూ ఇద్దరు బరిలోకి 
  • బీజేపీ అభ్యర్థిపై త్వరలో ప్రకటన, ఎన్నికపై కాంగ్రెస్ కూడా సీరియస్​గా ఫోకస్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల భయం మొదలైంది. టీఆర్ఎస్ మద్దతు కోరుతూ ఇద్దరు అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్న దానిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంటుందనే ప్రచారం నేపథ్యంలో టీఆర్​ఎస్, కాంగ్రెస్ పార్టీలూ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. జనరల్ ఎలక్షన్ విధుల్లో టీచర్లే కీలకం కావడంతో అన్ని పార్టీలూ వారిని మచ్చిక చేసుకునే పనిలో పడుతున్నాయి.  

మద్దతుపై దాటవేత 

మహబూబ్​నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023 మార్చి 29న ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనుండటంతో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లో సర్కారు మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసి యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డిపై గెలిచారు. ఈసారి పీఆర్టీయూ నుంచి జనార్దన్ రెడ్డికి కాకుండా సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డికి టికెట్ వచ్చింది. దీంతో జనార్దన్ రెడ్డి ఆ సంఘం నుంచి బయటకొచ్చి పీఆర్టీయూటీ నుంచి పోటీ చేస్తానని తాజాగా ప్రకటించారు. అయితే, మండలిలో జనార్దన్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో జనార్దన్ రెడ్డి, చెన్నకేశరెడ్డిలలో టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందన్న దానిపై క్లారిటీ రాలేదు. ‘‘ముందు ప్రచారం చేసుకోండి.. మద్దతు ఆలోచన మానుకోండి. తర్వాత చూద్దాం’’ అంటూ ఇద్దరికీ సర్కారు పెద్దలు చెప్పినట్టు తెలిసింది. 

అన్ని పార్టీలకూ కీలకమే 

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) తరపున పోటీ చేసే అభ్యర్థికి బీజేపీ మద్దతివ్వనున్నది. ఇప్పటికే వెంకట్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డితో పాటు మురళీమనోహర్ పేర్లు ఢిల్లీ పెద్దల పరిశీలనకు వెళ్లినట్టు ఆ సంఘం నేతలు చెప్తున్నారు. కాబట్టి బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించే అవకాశమూ ఉంది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలూ దీన్ని సీరియస్​గా తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ప్రకటన రాలేదు. పీసీసీ మెంబర్​గా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకే ఆ పార్టీ మద్దతిచ్చే చాన్స్​ ఉందని చర్చ జరుగుతోంది. యూటీఎఫ్, ఎస్టీయూ అభ్యర్థులను ప్రకటించగా వారికి సీపీఎం, సీపీఐ మద్దతిచ్చే అవకాశముంది. జనరల్ ఎన్నికలకు ముందు జరిగే చివరి ఎన్నికలు కావడంతో ఆయా పార్టీలు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్​గా తీసుకోనున్నాయి. 

టీచర్లకు సర్కారు వల 

ప్రస్తుతం టీచర్లు సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీవో 317తో ఇబ్బందులు, స్పౌజ్ బదిలీలు, జనరల్ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వకపోవడం, పండిట్ పీఈటీ అప్​గ్రేడేషన్ పెండింగ్​, టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడం, బడుల్లో సమస్యలను పరిష్కరించకపోవడం.. తదితర అంశాలపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో టీచర్ల సంఘాల నుంచి కొంత వ్యతిరేకతను తగ్గించునేందుకు కొన్ని టీచర్ యూనియన్ల లీడర్లకు ఇటీవలే ఓడీ సౌకర్యం కల్పించారు. త్వరలోనే బదిలీలు, ప్రమోషన్లపైనా క్లారిటీ ఇచ్చే అవకాశముంది.