టీచర్ల ప్రమోషన్లపై అప్పుడు ఓ మాట.. ఇప్పుడు మరోమాట

టీచర్ల ప్రమోషన్లపై అప్పుడు ఓ మాట.. ఇప్పుడు మరోమాట
  • టీచర్ల ప్రమోషన్లు మళ్లీ మొదటికి
  • అప్పుడు పాత జిల్లాల ప్రకారమేనని ప్రకటన.. 
  • ఇప్పుడు కొత్త జిల్లాల వారీగా అంటూ లీకులు 
  • క్యాడర్ విభజన, లోకాలిటీ తేల్చకుండా కష్టమే 
  • ఈ ప్రక్రియకు ఏడాది టైమ్ పట్టే చాన్స్ 
  • సర్కారు ఆలోచనపై టీచర్స్ సంఘాల మండిపాటు 

హైదరాబాద్, వెలుగు: సర్కార్ టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రాసెస్ మళ్లీ మొదటికొచ్చింది. మూడు నెలల కింద అసెంబ్లీలో పాత జిల్లాల ప్రకారమే ప్రమోషన్లు, బదిలీలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో.. కొత్త జిల్లాల ప్రకారమే ప్రక్రియ చేపట్టాలని ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే జరిగితే టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు పూర్తికావాలంటే కనీసం ఏడాది పడుతుందని అధికారులు చెప్తున్నారు.  

మారిన సర్కార్ నిర్ణయం 
రాష్ట్రంలో గవర్నమెంట్, జెడ్పీ స్కూళ్లలో పనిచేసే సర్కారీ టీచర్లు 1.06 లక్షల మంది ఉన్నారు. చివరిసారిగా 2018లో టీచర్ల బదిలీలు జరిగాయి. ప్రమోషన్లు కూడా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న టీచర్లకు మాత్రమే 2015లో ఇచ్చారు. మిగిలిన క్యాడర్​కు ప్రమోషన్లపై కోర్టులో కేసులు ఉండటంతో ఇవ్వలేదు. ఇటీవల పలుమార్లు టీచర్ల ప్రమోషన్లు, బదిలీలపై సీఎం కేసీఆర్ ​ప్రకటనలు చేసినా అమలుకు నోచుకోలేదు. మార్చిలో అసెంబ్లీ సమావేశాల్లోనూ పాత జిల్లాల ప్రకారం టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయని ప్రకటించారు. ఇప్పటికీ దానిపై స్పష్టత రాలేదు. తాజాగా ఓ టీచర్ యూనియన్ నాయకులు, ఆ సంఘానికి చెందిన టీచర్ ఎమ్మెల్సీలు ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను కలిశారు. అప్పటివరకూ పాత జిల్లాల ప్రకారమే బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని ఆ సంఘం డిమాండ్ ఉండేది. కానీ సీఎంను కలిసిన తర్వాత.. కొత్త జిల్లాల ప్రకారమే బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్టు సీఎంవో నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. వాస్తవంగా అది సర్కారు నిర్ణయమనేది స్పష్టంగా అర్థమవుతోంది. 33 కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో, పాత జిల్లాలతో బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వడం కష్టమని వారితో సీఎం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అంతర్ జిల్లా, స్పౌజ్ బదిలీల ప్రక్రియ వెంటనే ప్రారంభరం అవుతుందని సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. కానీ విద్యాశాఖ అధికారులు ఆ ఫైల్​ను సీఎం ఆమోదానికి పంపినా, అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది.  

టీచర్లకే ప్రమోషన్లు లేవు   
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇటీవల ప్రమోషన్లు ఇచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్​లో ఆఫీసర్ ​స్థాయి నుంచి అటెండర్ స్థాయి సిబ్బంది వరకూ అందరికీ ప్రమోషన్లకు అవకాశమిచ్చింది. అదే డిపార్ట్​మెంట్​లోని టీచర్లకు మాత్రం ప్రమోషన్లు ఇవ్వలేదు. టీచర్లకు అడ్​హక్ ప్రమోషన్లు ఇచ్చేందుకు ఇబ్బందులు లేకున్నా, సర్కారు ఆ పనిచేయకపోవడం గమనార్హం.   

క్యాడర్, స్థానికతపై లేని స్పష్టత  
కొత్త జోన్లకు ఆమోదం తెలపడంతో క్యాడర్ విభజన జరగాల్సి ఉంది. ఏయే పోస్టులు ఏ స్థాయి పోస్టులనేది స్పష్టత రావాలి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓ తదితర పోస్టుల క్యాడర్ విభజన చేయాల్సి ఉంది. మరోపక్క ఇంటిగ్రేటేడ్ క్యాడర్ (హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, డైట్ లెక్చరర్లు)పై కేసు ఉంది. అది తేలకుండా విభజన సాధ్యం కాదని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్ల స్థానికత తేలాలి. చాలామంది టీచర్లు ఆర్డర్ టు సర్వ్ విధానంలో వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలంటే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. టీచర్లకు ఆప్షన్ ఇచ్చి వారి స్థానికత తేల్చాలి. ఆ ఆప్షన్లు ఎక్కువైతే ఎలా? అనేదానిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. జిల్లాల్లో టీచర్ల సీనియారిటీ సమస్య వచ్చే అవకాశముంది. ఈ సమస్యలు పరిష్కారమైతే తప్ప, కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం లేదు. సర్కారు ఈ విధానమే అమలు చేయాలని నిర్ణయిస్తే, ఏడాదికిపైగా టైం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాత జిల్లాల ప్రకారమైతే వెంటనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టే అవకాశముందంటున్నారు. టీచర్లంతా పాత జిల్లాల ప్రకారం కోరుతుంటే, సర్కారు కొత్త జిల్లాల పాట ఎత్తుకోవడంపై సంఘాలు మండిపడుతున్నాయి.