జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి..ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

జీవో 317 బాధితులకు న్యాయం చేయాలి..ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో  రౌండ్  టేబుల్  సమావేశం

ముషీరాబాద్, వెలుగు: జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని జేఏసీ అధ్యక్షుడు విజయ్ కుమార్  కోరారు. ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ‘భవిష్యత్తు కార్యాచరణ– నిపుణుల సూచన’ అంశంపై రౌండ్  టేబుల్  సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా విజయ్ కుమార్  మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా 317 భాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక స్పౌస్, మెడికల్  వారికి మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించారని తెలిపారు. జీవో 317తో చెల్లాచెదురైన ఉద్యోగులందరికీ న్యాయం చేశామని గద్వాల సభలో సీఎం ప్రకటించారని చెప్పారు. అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో భాధితులందరికీ న్యాయం జరిగినట్లు సీఎం భావిస్తున్నారని పేర్కొన్నారు. తాత్కాలిక ఉపశమనం పేరుతో తీసుకువచ్చిన జీవో 190 ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. 

ఆగస్టు 15 లోగా న్యాయం చేయాలని, లేనిపక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని ధర్నా చౌక్  వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చలో గాంధీభవన్, సీఎం నివాసం వద్ద మెరుపు ధర్నా చేపడతామని తెలిపారు. జేఏసీ కన్వీనర్  మధుసూదన్ రెడ్డి, ఇంటర్మీడియట్  ఎడ్యుకేషన్  కన్వీనర్  బాలప్రసాద్, మహిళా నాయకురాలు వినోద, వర్కింగ్  ప్రెసిడెంట్  నాగేశ్వరరావు పాల్గొన్నారు.