- ఎస్టీయూ 80వ ఆవిర్భావ వేడుకల్లో చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: టీచర్లు కేవలం సమస్యలకే పరిమితం కాకుండా, విద్యాభివృద్ధికి, సామాజిక సేవకు పునరంకితం కావాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. నాడు రాఘవాచారి, శ్యాంసుందరరావు వంటి మహోన్నత నాయకులు ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఆ పదవులకు గౌరవం తెచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీచర్లు అనుభవిస్తున్న అనేక హక్కులు, సౌకర్యాలు ఎస్టీయూ పోరాటాల ఫలితమేనని వెల్లడించారు.
మంగళవారం ఆయన కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన సంఘం 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ మాట్లాడారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పడిన తొలి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అని కొనియాడారు. ఎనిమిది దశాబ్దాలుగా టీచర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణే ధ్యేయంగా స్టేట్ టీచర్స్ యూనియన్ నిరంతరం పోరాడుతోందని చెప్పారు.
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ... పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నేతలు ఎం. పర్వత్ రెడ్డి, ఆర్. శివశంకర్, కరుణాకర్ రెడ్డి, ముకుంద్ రావు, బషీరొద్దీన్, మహమ్మద్ అలీ, పున్న గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
