టీచర్లు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు మీరు రోడ్ల మీదికి వస్తే రాష్ట్రానికి మంచిది కాదు  : సీఎం రేవంత్ రెడ్డి

టీచర్లు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు మీరు రోడ్ల మీదికి వస్తే రాష్ట్రానికి మంచిది కాదు  : సీఎం రేవంత్ రెడ్డి
  • విధ్వంసమైన విద్యను  వికాసం వైపు నడిపిస్తున్నం
  • బడుల బలోపేతానికి పునరంకితమవుదాం
  • రాబోయే రెండేండ్లు ఫోకస్డ్​​గా పని చేయాలి
  • మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది
  • లేదంటే వచ్చే ఎన్నికల పరీక్షలో నాకు మార్కులు వేయకండి
  • కొడంగల్​లో జరిగిన టీచర్స్​ డే వేడుకల్లో సీఎం రేవంత్​ రెడ్డి

మహబూబ్​నగర్​/కొడంగల్, వెలుగు: ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. వారి ఉచ్చులో పడ్తే మిమ్మల్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని బ్లాక్​ మెయిల్​ చేస్తారని పేర్కొన్నారు. టీచర్లు రోడ్డెక్కితే ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిదికాదన్నారు. మిగతా శాఖలు వేరు, టీచర్లు వేరని, మీరు ధర్నాలు, దీక్షలు, చలో హైదరాబాద్​ కార్యక్రమాలు చేస్తే పిల్లల మనస్సుల్లో ఆలోచనలు మారుతాయని చెప్పారు.

‘ఇటీవల ఇందిరా పార్క్ వద్ద టీచర్లు ధర్నా చేస్తుంటే చూసి బాధైంది. సీఎంగా, విద్యా శాఖ మంత్రిగా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. టీచర్లు రోడ్డు మీదికి రావొద్దు. మీ ఆత్మగౌవరం నిలబడేలా, మీ సమస్యలు పరిష్కరించేలా ముందుకు వెళ్తున్నాను. మీకు 35 ఏండ్ల సర్వీస్ ఉంది. మా సర్వీస్​ ఐదేండ్లు.  ఐదేండ్ల తర్వాత మళ్లీ మేం ప్రజలకు వద్దకు వచ్చి పరీక్ష రాయాలి. 2028 డిసెంబరులో లేదా 2029 మార్చి, ఏప్రిల్​లో ఎన్నికలు ఉండవచ్చు. అప్పుడు ఎన్నికల పరీక్ష రాయడానికి నేను మీకు వద్దకే వస్తాను.

నేను బడి దొంగను కాదు. వెయ్యి రోజుల్లో ఒక గంట కూడా సెలవు తీసుకోలేదు. కేసీఆర్​ వెయ్యి రోజుల్లో గంట కూడా పని చేయలేదు. నేను పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు మీ చేతిలోనే బలం ఉంటుంది. ఆ పేపర్​ దిద్దేది మీరే. ఆ పెన్ను మీ దగ్గరే ఉంది. మార్కులు వేసేది కూడా మీరే. రానున్న రెండేండ్లలో మీ సమస్యలు పరిష్కరించకుంటే ఈ ఎగ్జామ్​లో నన్ను ఫెయిల్​ చేయండి. రెండేండ్లలో మీరు ఆశించిన మేరకు నేను ప్రర్తించకపోతే నూటికి నూరే వేస్తారో? గుండు సున్నా వేస్తారో మీ ఇష్టం’ అని అన్నారు.

వికారాబాద్​ జిల్లా కొడంగల్​లోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో శనివారం రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టీచర్స్​ డే’ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 123 మందికి అవార్డులు, ప్రశంస పత్రాలు అందించి సన్మానించారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు  రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పవర్​ పాయింట్​ప్రజంటేషన్​ ద్వారా  సీఎం వివరించారు. 

 విధ్వంసం  నుంచి వికాసం వైపు.. 

రాష్ట్రంలో పదేండ్లు విధ్వంసానికి గురైన విద్యను  వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఇందుకు టీచర్లు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. పిల్లల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ఎడ్యుకేషన్​ పాలసీ రూపొందించి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి మనమందరం పునరంకితం కావాలన్నారు. రెండేండ్లు కష్టపడితే తెలంగాణ దేశంలోనే ఆదర్శమైన విద్యా బోధనను తీసుకురాగలదన్నారు.

‘ఓ మాజీ మంత్రి ఇటీవల వనపర్తిలో పర్యటించిండు. స్టూడెంట్లను పట్టుకొని సర్కారు బడుల్లో చదువుకుంటే ఏమైతరని ప్రశ్నించిండు? ఈ విషయాన్ని కొత్తకోటకు చెందిన పిల్లలు నా దృష్టికి తెచ్చిన్రు. వాళ్లకు ఒక్కటే మాట చెప్పిన. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే రాష్ట్రానికి సీఎంలు కావ్వొచ్చని చెప్పిన. భష్యత్తులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్​, ఐపీఎస్​లు అవుతారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఏలుతారని చెప్పిన. ఇదే విషయాన్ని ఎవరడిగినా చెప్పండని చెప్పిన’ అని సీఎం అన్నారు. 

మిమ్మల్ని ముంచిన వారి దగ్గరికే పోతారా?

లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ ఆ బాధ్యతను కల్వకుంట్ల కవితకు అప్పగించడంపై సీఎం మండిపడ్డారు. పదేండ్లు బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలో ఉండి సమస్యను పరిష్కరించలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్​ కుటుంబం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. పేరు, వేషం మార్చుకొని వచ్చే వారిని నమ్మితే అంతే సంగతులన్నారు. తాను కొడంగల్​లోనే ఉన్నానని, మధుసూదన్​ తనతో మాట్లాడకుండా నిండా ముంచిన కల్వకుంట్ల కుటుంబం వద్దకు పోయి ఈ వ్యవస్థను కవిత చెతుల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​ సంపాదించిన అడ్డగోలు ఆస్తి పంచుకోవడానికి అన్నాచెల్లెళ్లు కొట్లాడుకుంటున్నారని.. వాళ్ల చేతులకు తెలంగాణ జూనియన్ కాలేజీల వ్యవస్థను అప్పజెప్పడం ఏమిటని  ప్రశ్నించారు.   

డిగ్రీ పట్టాలతో విదేశాల్లో మాస్టర్స్ చేయొచ్చు

పాలిటెక్నిక్, స్కిల్ యూనివర్సిటీలు, ఏటీసీ సెంటర్లను మంజూరు చేస్తే, బీఆర్​ఎస్​ వాళ్లు వీటిని ప్రైవేట్​ పరం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఔట్ డేటెడ్ సిలబస్​తో డీజిల్ మెకానిక్ నేర్చుకున్నా.. బయటకు వచ్చాక విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లేవన్నారు. ఈ విషయం తెలసి టాటా ఇనిస్టిట్యూట్​తో మాట్లాడి 1956లో ఏర్పాటు చేసిన ఐటీఐలను ఏటీసీ సెంటర్లుగా అప్​గ్రేడ్​ చేస్తున్నామన్నారు.

సిలబస్​ను మార్చి, రోబో మెషీన్​లను ఏర్పాటు చేసి ఇన్​స్రక్టర్లను నియమించామన్నారు. కార్పొరేట్​ సంస్థలను ఏకం చేసి, ఇక్కడ చదువుకున్న వారికి కోర్సు పూర్తైన వెంటనే ఉద్యోగం దొరికేలా మానిటరింగ్​ చేస్తున్నామన్నారు.  స్కిల్ వర్సిటీలో డిగ్రీ పట్టాలు పొందిన వారు, ఈ పట్టాలతో విదేశాల్లో మాస్టర్స్ చదువుకుననే అవకాశం ఉందన్నారు. పాలిటెక్నిక్​ కాలేజీలను కూడా స్కిల్ వర్సిటీలుగా మారుస్తున్నామన్నారు. పాలిటెక్నిక్​ కోర్సు పూర్తి చేస్తే ఎప్పట్లాగే ఇంజనీరింగ్​ సెకండ్​ ఇయర్​లో చేరొచ్చని సీఎం స్పష్టంచేశారు.  

సీఎం కొడంగల్ టూర్ సక్సెస్

నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్​ సక్సెస్​ అయ్యింది. మొదటి రోజు శుక్రవారం ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్​లోని మద్దూరు, దౌల్తాబాద్, దుద్యాల మండలం హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులు, డిగ్రీ కాలేజీ, గురుకులాల నిర్మాణాలను పరిశీలించారు.  రెండో రోజు శనివారం స్థానిక కాంగ్రెస్ కేడర్ తో సమావేశమయ్యారు. అనంతరం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ‘టీచర్స్ డే’ వేడుకల్లో పాల్గొని అవార్డులు అందజేశారు.

అనంతరం కొడంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్, ఇందిరమ్మ క్యాంటీన్, ఎంపీపీఎస్, జడ్పీహెచ్‌ఎస్ నూతన భవనాలు,  ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లను ప్రారంభించారు. కార్యక్రమంలో స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు టి.రాంమోహన్​రెడ్డి, మనోహర్​రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్​, శ్రీపాల్​రెడ్డి పాల్గొన్నారు.

‘ఓ పేపరాయన టీచర్లు కొడంగల్​ పోవడానికి చాలా బాధపడుతున్నారని రాసిండు. కొడంగల్​ పోవడానికి చాలా కష్టపడుతున్నారని అందులో పేర్కొన్నడు. కొడంగల్​ రావడానికి టీచర్లకు ఏదైనా బాధ, సమస్య ఉందా? తండాలు, గూడెలు, మారుమూల పల్లెలు, ఆదిలాబాద్​ అడవుల్లో మీరు చదువు చెప్తున్నరు. కొడంగల్​కు అన్ని రోడ్లు ఉన్నయ్.  ఇక్కడికి రావానికి టీచర్లకు ఎలాంటి బాధ లేదు. ఆ పత్రికాయనకు, ఆ పార్టీ లీడర్లకు ఇబ్బంది అవుతుందేమో గానీ..  కొడంగల్​ రావడానికి మా టీచర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

కేసీఆర్​ మీ సమస్యలను జఠిలం చేసిండు

కేసీఆర్​ పదేండ్లు అధికారంలో ఉండి టీచర్ల సమస్యలను పరిష్కరించకపోగా.. జఠిలం చేశారని సీఎం ఫైర్​ అయ్యారు.  2014 జూన్​ 2 న 70 వేల కోట్ల అప్పుల భారంతో రాష్ట్రం ఏర్పాటైందన్నారు. 16 మంది సీఎంలు 60 ఏండ్లలో ఈ అప్పు చేశారన్నారు. కానీ, కేసీఆర్​ కుటుంబానికి మీరు రాష్ట్రాన్ని అప్పజెప్తే పదేండ్లు అధికారంలో ఉండి 8.11 లక్షల కోట్ల అప్పు మిగిల్చారన్నారు.  రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ఇవ్వకుండా సర్వీసు ఏజ్​ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు కేసీఆర్​ పెంచిండన్నారు.

పదేండ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ.8వేల కోట్ల రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ పెండింగ్​లో పెట్టి కేసీఆర్​ ఫామ్​ హౌస్​లో నిద్రపోతున్నాడన్నారు. మీ సమస్యల పట్ల ఆయనకు బాధ్యత లేదన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే ఉద్యోగుల రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ ఇవ్వాలని చెబితే వంద రోజుల్లో ఆరు వేల కోట్లు ఇస్తామని చెప్పి, 90 రోజుల్లోనే ఆరు వేల కోట్లను ఉద్యోగుల ఖాతాల్లో వేశామన్నారు.