
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీగా పోరాటం నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చేనెల 23న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సోమవారం హైదరాబాద్లో స్టీరింగ్ కమిటీ నేతలు సమావేశమై, ఆందోళనలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు.
టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని, కొత్త జిల్లాలు, మండలాలకు డీఈఓ, డిప్యూటీఈఓ, ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని , పెండింగ్ లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని కోరారు. వీటన్నింటి కోసం ఈ నెల 23,24 తేదీల్లో అధికారులకు వినతులు, ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు ఎం.సోమయ్య, చావ రవి, వెంకట్, చకినాల అనిల్ కుమార్, తిరుపతి, లింగారెడ్డి, హరికిషన్, కొండయ్య, సైదులు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.