దేశీయ ఐటీ రంగంలో వరుస వివాదాలు కలకలం రేపుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ క్యాంపస్‌లో వెలుగుచూసిన మత మార్పిడి రాకెట్ మరువకముందే.. ఇప్పుడు మరో టాప్ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ముంబై గోరేగావ్ ఆఫీసులో విభిన్నమైన పని వాతావరణం నెలకొందని.. మతపరమైన వివక్ష చూపుతున్నారని సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారం ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశీయ టెక్ కంపెనీలు వరుసగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంతో అసలు కంపెనీల్లో ఏం జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.
టెక్ మహీంద్రాపై ఆరోపణలు..
ఈ వివాదం బాంబే హైకోర్టు న్యాయవాది, బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధి అశుతోష్ జె దూబే షేర్ చేసిన ఒక స్క్రీన్‌షాట్‌తో వెలుగులోకి వచ్చింది. టెక్ మహీంద్రాకు చెందిన ఒక ఉద్యోగి పంపినట్లుగా చెబుతున్న సమాచారం ప్రకారం రిక్రూట్మెంట్స్ సమయంలో మతపరమైన వివక్ష చూపుతున్నారని, ఆఫీస్ రూల్స్ అమలులో అసమానతలు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యంగా మతపరమైన సందర్భాల్లో కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, కంపెనీ HR తీరుపై కూడా ఆ సందేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకెళ్లాలని ఆ ఉద్యోగి విజ్ఞప్తి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.
Received Instagram DM of girl employee: At Tech Mahindra office, pantry declared “Footwear-Free Zone” till Ramzan for prayers & iftar.
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) April 12, 2026
Colleagues asked to follow it in the name of “unity”.
Question is simple: Is workplace policy now religion-based, or should it remain neutral… pic.twitter.com/pL1u3l79f7
కంపెనీ వివరణ..
అయితే ఈ ఆరోపణలను టెక్ మహీంద్రా యాజమాన్యం గట్టిగా తిప్పికొట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని.. వాస్తవాలకు దూరంగా ఉన్నాయని సంస్థ ప్రతినిధి చెప్పారు. ఈ ఆరోపణలపై ఇంటర్నల్ వెరిఫికేషన్ జరిగిందని, వైరల్ అవుతున్న ‘ఫుట్‌వేర్ ఫ్రీ జోన్’ ఫోటో తమ ఆఫీసుకు చెందినది కాదని తేల్చి చెప్పింది టెక్ మహీంద్రా గ్రూప్. అలాగే రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎటువంటి మతపరమైన పక్షపాతం లేదని, సంస్థ విలువలను దెబ్బతీసేలా జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
టెక్ మహీంద్రా తన వివరణలో సంస్థ ఎప్పుడూ సమగ్రత, గౌరవం, సమానత్వానికి కట్టుబడి ఉంటుందని పేర్కొంది. మతం, కులం లేదా ఇతర విభేదాలకు తావులేకుండా ప్రతి ఉద్యోగిని గౌరవప్రదంగా చూస్తామని కంపెనీ భరోసా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరంతరం మానిటరింగ్ కొనసాగుతుందని పేర్కొంది. టీసీఎస్ ఘటన నేపథ్యంలో ఐటీ కంపెనీలపై నిఘా పెరిగిన వేళ టెక్ మహీంద్రా వివరణ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో వేచి చూడాల్సిందే.

