ఇయ్యాల కాంగ్రెస్ లోకి తీగల కుటుంబం..

ఇయ్యాల కాంగ్రెస్ లోకి తీగల కుటుంబం..
  • బీఆర్ఎస్ కు తీగల రాజీనామా
  • ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి కూడా.. 

ఎల్ బీనగర్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆదివారం రాజీనామా లెటర్ పంపించారు. తగిన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీని వీడుతున్నామని అందులో పేర్కొన్నారు. 

ఆదివారం మీడియాతో కృష్ణారెడ్డి, అనిత మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం తమను పట్టించుకోలేదని, అందుకే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. సోమవారం ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు వెల్లడించారు. కాగా, వీళ్లిద్దరూ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెల్లారే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

 టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి.. హైదరాబాద్‌ మేయర్‌గా పని చేశారు. 2014లో మహేశ్వరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్‌ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సబితారెడ్డి కూడా బీఆర్‌ఎస్‌లో చేరడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి.