దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో మృతిచెందిన పైలట్, వింగ్ కమాండర్ నమాన్స్ సయాల్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్ లో జరిగాయి. ఆదివారం (నవంబర్ 23) కాంగ్రా జిల్లాలోని పాటియాల్కర్ లో బాధాతప్త హృదయాలతో నమాన్స్ సయాల్ కు వీడ్కోలు పలికారు. వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న నమాన్స్ భార్య అప్షాన్ అక్తర్ కన్నీటీతో నివాళులర్పించారు. సయాల్ భౌతిక కాయాన్ని ఆయన పూర్వీకుల గ్రామం అయిన పాటియాల్కర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
34ఏళ్ నమాన్ష్ సయాల్ కు భార్య , ఆరేళ్ల కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. సయాల్ మరణవార్తతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వింగ్ కమాండర్ సయాల్ అంకిత భావం గల యుద్ద పైలట్ అని IAF కొనియాడింది. అచంచలమైన నిబద్దత, అసాధారణ నైపుణ్యం, అలుపెరుగని కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేశారని , ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ , విషాద సమయంలో పైలట్ కుటుంబానికి అండగా నిలుస్తామని IAF తెలిపింది.
దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా అల్ మక్తూమ్ ఎయిర్ బేస్ లో నెగెటిల్ జి విన్యాసం చేస్తుండగా తేజస్ పైటర్ జెట్ కూలిపోవడంతో శుక్రవారం వింగ్ కమాండ్ నమాన్స్ సయాల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ(CoI)ని ఆదేశించింది IAF.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సహా ఉన్నతాధికారులు వింగ్ కమాండర్ సియాల్‌కు నివాళులర్పించారు. తేజస్‌ను తయారు చేసే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కూడా IAF పైలట్ దురదృష్టవశాత్తూ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది.
