రైతులు అన్ని రకాల పంటలు పండించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ అన్నారు. కొన్నిరకాల పంటలే కాదు కూరగాయలు కూడా పండించాలని రైతులకు సూచించారు. రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు.
2004 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన జలయఙ్ఞం ప్రాజెక్ట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు అమలు చేశామన్న సీఎం .. రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు అప్పుభారం తగ్గించేందుకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని చోట్ల పోరాడుతామని ఆవిర్భావ వేడుకల్లో తెలిపారు.
గత పదేళ్లలో సాగునీటి పరిస్థితి మారలేదన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్ పనులను తిరిగి ప్రారంభించామన్నారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామన్నారు. రైతులను శ్రీమంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలను రుణాల నుంచి విముక్తి కల్పించామన్నారు.
