హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 వరకు జరిగే ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31,542 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానుండగా, వారి కోసం 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సైన్స్ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయన్నారు.
ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను రెండు వేర్వేరు రోజుల్లో ఉదయం 09:30 గంటల నుంచి 11:00 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని లేదా తమ స్కూల్ హెడ్మాస్టర్ల నుంచి కూడా పొందవచ్చని డైరెక్టర్ వెల్లడించారు.
