హైదరాబాద్: సస్పెన్షన్‌లో ఉన్న మాజీ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై తెలంగాణ ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. భుజంగరావు ఇళ్లల్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. మార్కెట్ రేట్ ప్రకారం రూ.100 కోట్లకు పైగా భుజంగరావు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
భుజంగరావుకు చెందిన 16 చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని భుజంగరావు నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఒకే సమయంలో సోదాలు జరిగాయి.
సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇళ్లు, 1 కమర్షియల్ భవనం గుర్తించారు. ఇంట్లో రూ.3.83 లక్షల నగదు, రూ.8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. సుమారు 1 కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మారుతి స్విఫ్ట్, కియా సెల్టోస్ కార్లు గుర్తించారు.
గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5.92 కోట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ అంచనా వేసింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉండొచ్చని ఏసీబీ పేర్కొంది. సోదాల్లో 29 మద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. నిందితులను నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ కోసం హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
