ఆధార్‌ సంస్థ నోటీసులివ్వడంపై హైకోర్టుకు వెళ్తాం, న్యాయపోరాటం చేస్తాం

ఆధార్‌ సంస్థ నోటీసులివ్వడంపై హైకోర్టుకు వెళ్తాం, న్యాయపోరాటం చేస్తాం

సిటిజన్ షిప్, ఎన్ఆర్‌సి పై పూర్తి వివరాలు అందజేయమని ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించింది తెలంగాణ న్యాయవాదుల సంఘం. సిటిజన్ షిప్ వివరాలను అడిగే హక్కు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు లేదని అడ్వకేట్స్ అన్నారు. బుధవారం నగరంలోని నాంపల్లిలో తెలంగాణ అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ వలి మాట్లాడుతూ.. ఇప్పటికే ఎన్ఆర్‌సి , సీఏఏ పై ముస్లిం ప్రజల్లో గందర గోళం నెలకొనగా.. ఒరిజినల్ పత్రాలతో తమ ముందు హాజరు కావాలని ఆధార్ ఎన్రోల్మెంట్ శాఖ ఎలా నోటీసులు జారీ చేస్తుందని ప్రశ్నించారు. నగరంలో నివసిస్తున్న 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ అంశంపై తెలంగాణ న్యాయవాదుల సంఘం తరఫున హై కోర్టులో కేసు ఫైల్ చేస్తామని చెప్పారు.

గుట్టుచప్పుడు కాకుండా రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్లో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, పూర్తి ఒరిజినల్ పత్రాలతో తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు అడ్వకేట్. కేంద్రం ఓ వైపు ఆధార్ కార్డుకు, NRC కి సంబంధం లేదని చెబుతూనే, దొడ్డి దారిలో ఇలాంటి నోటీసులు ఎలా జారీ చేస్తారని అడిగారు. హైకోర్టులో 127 మంది బాధితుల తరుపున పిటిషన్ దాఖలు చేసి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.