రాష్ట్రంలోని లాయర్లపై దాడి చేస్తే ఏడేండ్లదాకా జైలు

రాష్ట్రంలోని లాయర్లపై దాడి చేస్తే ఏడేండ్లదాకా జైలు
  •     న్యాయవాదుల అరెస్టుకు కోర్టు అనుమతి తప్పనిసరి
  •     తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అమల్లోకి 
     
  •     గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్‌ చేసిన రాష్ట్ర న్యాయ శాఖ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని న్యాయవాదుల రక్షణ చట్టం(2026) రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం జూన్ 2 నుంచి అమలులోకి వచ్చినట్టుగా ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. కోర్టుల్లో కక్షిదారుల తరఫున వాదించే లాయర్లు ఎటువంటి ఒత్తిళ్లు, భయాలు లేకుండా తమ విధులను నిర్భయంగా, స్వతంత్రంగా నిర్వహించేలా చేయడమే కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం. న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై భౌతిక దాడులు, బెదిరింపులకు గురిచేయడం లేదా దుర్భాషలాడటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయి. 

విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులపై దాడికి పాల్పడే వారికి ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు కనీసం రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ సదరు వ్యక్తి రెండోసారి నేరానికి పాల్పడితే ఆ శిక్షను ఒకటి నుంచి ఏడేళ్ల వరకు పొడిగించేలా, రూ.50,000 నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు జరిమానా వసూలు చేసేలా చట్టంలో నిబంధనలు చేర్చారు.  తప్పుడు కేసులు(మెలీషియస్ ప్రాసిక్యూషన్) బనాయించే వ్యక్తులకు సైతం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తారు.  

లాయర్ల అక్రమ అరెస్టులకూ చెక్ 

న్యాయవాదులను అరెస్టు చేయాల్సి వస్తే.. తప్పనిసరిగా సంబంధిత న్యాయస్థానం నుంచి అనుమతి (జ్యుడీషియల్ ఆర్డర్) పొందాల్సి ఉంటుంది. దీనితో అక్రమ అరెస్టులు, కక్షసాధింపులకు చెక్ పడనుంది. గతంలో పెద్దపల్లి జిల్లాలో ప్రముఖ న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి దారుణ హత్యకు గురైన ఉదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.  న్యాయవాద సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి 30, 2026న శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.