804 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌‌ - 4 పోస్టుల కేటాయింపు 

804 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌‌ - 4 పోస్టుల కేటాయింపు 
  • ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో హెచ్‌‌ఓడీ పరిధిలో ఉన్న పోస్టుల్లోంచి మరో 804 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌‌–-4 పోస్టులను జిల్లాలకు కేటాయిస్తూ పంచాయతీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌‌ డి. దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 6,603 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను గ్రేడ్‌‌–-4 పంచాయతీ కార్యదర్శి పోస్టులుగా మారుస్తూ గతంలో ప్రభుత్వం జీవో  జారీ చేసింది. ఇందులో 5,710 పోస్టులను గతంలోనే జిల్లాలకు కేటాయించగా, మిగిలిన పోస్టులు హెచ్ఓడీ వద్ద  ఉన్నాయి.

జిల్లా పంచాయతీ అధికారుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా తాజాగా మరో 804 గ్రేడ్–-4 పోస్టులను జిల్లాల వారీగా కేటాయించారు. ఈ కేటాయింపుల ప్రకారం అర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించి గ్రేడ్–-4 పోస్టింగ్‌‌లు ఇచ్చేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కమిషనర్ దివ్య ఆదేశించారు. తాజా కేటాయింపుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాకు 73 పోస్టులు దక్కాయి.

యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు 49 చొప్పున, జయశంకర్ భూపాలపల్లికి 44, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు 37 చొప్పున, మహబూబ్‌‌నగర్‌‌కు 35, ఆదిలాబాద్‌‌కు 30, నిజామాబాద్‌‌కు 12, ఖమ్మం జిల్లాకు 24 పోస్టులను కేటాయించారు. కలెక్టర్ల నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే అర్హులైన జేపీఎస్‌‌లు గ్రేడ్–-4 కార్యదర్శులుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు.