మున్సి పాలిటీలకు రెండేండ్లలో 17 వేల కోట్లు

మున్సి పాలిటీలకు రెండేండ్లలో 17 వేల కోట్లు
  •     వివిధ దశల్లో అభివృద్ధి పనులు
  •     హైదరాబాద్ తరహాలో సౌలతులు  
  •     పట్టణాల రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గత రెండేళ్ల కాలంలోనే మున్సిపాలిటీల రూపురేఖలను మార్చేలా రూ.17,472.22 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 మున్సిపాలిటీల పరిధిలో సుమారు 3,994 అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిధుల కేటాయింపుతో పాటు పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టింది. 

దశాబ్దాలుగా ఉమ్మడి విభాగంగా ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ శాఖలో మార్పులు తీసుకొచ్చింది. పరిపాలన సౌలభ్యం, పనుల పర్యవేక్షణ కోసం ఈ శాఖను రెండుగా విభజించింది. హైదరాబాద్ మహానగరంతో కూడిన ‘కోర్ అర్బన్ రీజియన్’ కోసం ఒక విభాగం, రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల కోసం మరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. 

హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోని ప్రతి పట్టణంలోనూ అన్ని రకాల వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న రూ. 996.27 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులను ప్రస్తుత ప్రభుత్వం ఒకే విడతలో విడుదల చేసింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ ‘రాష్ట్రాల ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం’ పథకం కింద అవసరమైన సంస్కరణలను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంతో అదనంగా రూ.1,698 కోట్ల నిధులను పొందేందుకు తెలంగాణ అర్హత సాధించింది.

వివిధ రకాలుగా పనులు.. 

పట్టణాల్లో మౌలిక వసతుల కోసం వివిధ పథకాల ద్వారా నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. నగరాభివృద్ధి నిధి కింద 130 మున్సిపాలిటీల్లో 2,374 పనులకు రూ.9,387.11 కోట్లు ఖర్చు చేస్తోంది. టఫ్ ఇడ్కో నుంచి 85 మున్సిపాలిటీలలో రూ.1,896.96 కోట్ల నిధులతో 1,166 పనులు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ డ్యూటీ కింద  స్థానిక సంస్థల బలోపేతానికి 110 మున్సిపాలిటీలకు రూ.462.19 కోట్లు బదిలీ చేసింది. అమృత్  స్కీమ్ కింద 109 మున్సిపాలిటీలలో రూ.4,729.69 కోట్లతో పనులు జరుగుతున్నాయి.