ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్లు..అంచనా వ్యయం రూ.368 కోట్లకు పెంపు

ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్లు..అంచనా వ్యయం రూ.368 కోట్లకు పెంపు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌లోని ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్(బంజారాహిల్స్), టీవీ9 జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 736 ద్వారా పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా గతంలో రూ.210 కోట్లుగా ఉన్న ఈ అంచనా వ్యయం.. పలు మార్పులు, అదనపు నిర్మాణాల కారణంగా రూ.158 కోట్లు పెరిగి మొత్తం రూ.368 కోట్లకు చేరింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వైపు రూ.147 కోట్లతో రెండు లేన్ల ఫ్లైఓవర్‌‌‌‌ను ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్ వద్ద నిర్మిస్తారు. టీవీ9 జంక్షన్ వద్ద ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్ వైపు రూ.221 కోట్లతో మూడు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్‌‌‌‌తో పాటు, ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు రెండు లేన్ల అండర్‌‌‌‌పాస్‌‌‌‌ను నిర్మించనున్నారు. ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో కాంక్రీట్ స్థానంలో స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌‌‌‌సిగ్నల్ ఇచ్చింది.

విప్రో జంక్షన్‌‌‌‌లో మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచి, భూసేకరణతో పాటు సమాంతరంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రాఫిక్ అధ్యయనం ఆధారంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులు ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్ నుంచి ఆల్విన్ క్రాస్‌‌‌‌రోడ్స్ వరకు ట్రాఫిక్ కారిడార్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడనున్నాయి.