కరోనా కొత్త వేరియంట్‌ పై కేబినెట్‌ సబ్‌ కమిటీ

కరోనా కొత్త వేరియంట్‌ పై కేబినెట్‌ సబ్‌ కమిటీ

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  కారణంగా  రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ ప్రగతి భవన్‌లో సమావేశమైంది.  వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని,మందులను సిద్ధంగా ఉంచుకోవాలని  ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి, తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్మల్, కుమరం భీమ్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు.. టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉప సంఘానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చైర్మన్‌గా ఉండనున్నారు. మంత్రులు కేటీఆర్‌,ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు.