భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో తెలంగాణలో కులగణన : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో తెలంగాణలో కులగణన : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కేంద్రాన్ని ప్రశ్నిస్తే తీవ్రవాదులనే ముద్ర: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •  
  •     దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు
  •     గాంధీ భవన్‌లో ఘనంగా ఇండిపెండెన్స్​ డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కుల గణన సర్వే నిర్వహించారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శనివారం గాంధీ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రశ్నించే వారిని తీవ్రవాదులనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైంది కాదని, దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్.. రాష్ట్రంలో చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 

ఆయన చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవాలకు దూరంగా సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండించాలని, యువత నిజా నిజాలను తెలుసుకొని చైతన్యవంతులుగా వ్యవహరించాలని కోరారు. దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మాజీ ఎంపీ అంజన్ కుమార్, పార్టీ నేతలు మెట్టు సాయి కుమార్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.