- ఫొటోలు, పుట్టిన తేదీలో తప్పులుంటే వెంటనే సరిచేయండి
- అర్హత ఉన్న ఒక్క ఓటరు నష్టపోవద్దని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఎలాంటి తప్పుల్లేకుండా పక్కాగా ఓటరు జాబితాను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ వేగం పెంచాలని, డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆదేశించారు. సోమవారం అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీఈవోలు, ఈఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు రికార్డుల్లో తరచూ ఎదురవుతున్న ఫొటోలు లేకపోవడం, పుట్టిన తేదీల్లో వ్యత్యాసాలు, జెండర్ తప్పుగా పేర్కొనడం వంటి లోపాలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి సరిచేయాలని చెప్పారు. గడువు పొడిగించిన ఏడు రోజుల సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని అత్యంత పారదర్శకమైన జాబితాను విడుదల చేయాలన్నారు. ఓటరు సవరణల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన పెంచాలి: సీఈవో
ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా గైర్హాజరైన, నివాసం మార్చిన, చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల సమాచారాన్ని (ఏస్ఎస్ఎస్‌డీ జాబితాలు), నో మ్యాపింగ్ కేసులను పక్కాగా రీవెరిఫికేషన్ చేయాలని సీఈవో ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా లేదా పొరపాటున మిస్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా లోపాలు గుర్తించినట్లయితే తక్షణమే ‘రోల్-బ్యాక్’ ఆప్షన్ ఉపయోగించి రికార్డులను సవరించాలని స్పష్టం చేశారు. బిఎల్‌వోలు, సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు ఫీల్డ్‌లో పర్యటించి పరిశీలనను మరింత వేగవంతం చేయాలన్నారు.
బీఎల్ఓలు, గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల ఏజెంట్లతో నిర్వహించిన సమావేశాల మినిట్స్‌ను సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. 85 ఏళ్లు దాటిన వయోవృద్ధుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు బూత్‌లలోకి పోకుండా పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణను ఈసీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ముగించాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి ఎన్.శంకర్, డిప్యూటీ సీఈవో జీఎస్ చారి తదితరులు పాల్గొన్నారు.
