జై జవాన్.. జై కిసాన్.. జై యువ: సీఎం రేవంత్ రెడ్డి

జై జవాన్.. జై కిసాన్.. జై యువ: సీఎం రేవంత్ రెడ్డి
  • ఇది ఏఐ యుగం.. యువతకు విధాన నిర్ణయాధికారం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి 
  • 21 ఏండ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అయినప్పుడు.. చట్టసభల్లోకి ఎందుకు రాకూడదు? 
  • దీనిపై వచ్చే నెల అసెంబ్లీ, మండలి జాయింట్ సెషన్ పెట్టి తీర్మానం చేస్తం 
  • చట్టాలపై కేంద్రం ఏకపక్ష వైఖరి వీడి జేపీసీ వేయాల్సిందే 
  • డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌తో పాటే పోటీకి వయోపరిమితిని తగ్గించాలి 
  • ప్రశ్నించే గొంతుకలపై కక్ష సాధింపులు ఆపాలి.. మీడియాతో సీఎం చిట్ చాట్

హైదరాబాద్, వెలుగు: చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని, అందులో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి  సూచించారు.

విద్యావేత్తలు, యువజన సంఘాల ప్రతినిధులు, న్యాయ నిపుణుల వంటి విభిన్న భాగస్వాములతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాతే చట్ట సవరణలు చేయాలన్నారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని, సమష్టి నిర్ణయాల ద్వారానే సుస్థిర చట్టాల రూపకల్పన సాధ్యం అవుతుందన్నారు.

కేంద్రం తన పరిధిలోని దర్యాప్తు సంస్థలను, నిధులను ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం లేదా ప్రశ్నించే వారిని వివిధ దర్యాప్తు సంస్థల ద్వారా వేధించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ఆదివారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ మీడియాతో చిట్​చాట్ చేశారు. ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను వినేందుకు సిద్ధంగా ఉండాలని, కేవలం తన అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికే పరిమితం కాకూడదన్నారు. యువత, రైతులు, విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకపోతే  తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. 

యువత విధాన నిర్ణేతలుగా మారాలి.. 
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), లోక్‌‌‌‌సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలుపై విస్తృత చర్చ జరగనుందని సీఎం పేర్కొన్నారు. వీటన్నింటితో పాటు ఎన్నికల్లో పోటీకి వయో పరిమితి తగ్గింపు అంశాన్ని కూడా చేర్చి ఒకే విడతగా సమగ్రంగా చర్చించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఏఐ, టెక్నాలజీ రెవల్యూషన్ యుగంలో ఉందని, యువత ఆలోచనా దృక్పథం మునుపటి కంటే వేగంగా రూపాంతరం చెందుతోందన్నారు.

వికసిత్ భారత్ 2047 స్వప్నం కేవలం ప్రకటనలు, నినాదాల ద్వారా సాధ్యపడదని, యువత సాధికారత ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ  ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో దేశ భద్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేస్తూ, ప్రస్తుత కాలంలో దానికి ‘జై యువ’ నినాదాన్ని జోడించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

యువత కేవలం పౌరులుగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విధాన నిర్ణేతలుగా మారాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రకటించారు. దేశంలో కోట్లాది మంది యువకులు తమ హక్కుల కోసం వీధుల్లో పోరాటాలు చేయాల్సిన దుస్థితి మారాలని.. వారి స్వరానికి పార్లమెంట్, అసెంబ్లీ వేదికల్లో నేరుగా చోటు లభించాలన్నారు.

రాష్ట్రాల భాగస్వామ్యంతోనే ‘టీమ్ ఇండియా’ 
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాల హక్కులను కాలరాయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రేయస్కరం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పన్నుల వికేంద్రీకరణ, గ్రాంట్ల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రం దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ, ప్రతిఫలంగా రావాల్సిన నిధుల కేటాయింపుల్లో వివక్ష ఎదురవుతోందని పేర్కొన్నారు.

రాష్ట్రాల భాగస్వామ్యంతోనే ‘టీమ్ ఇండియా’ భావన నిజమవుతుందని, విపక్షాలు పాలించే రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మాత్రమే సహకార సమాఖ్య వ్యవస్థ ముందుకు సాగుతుందని కేంద్రానికి హితవు పలికారు. 

విద్యా వ్యవస్థను నాశనం చేసి.. బెదిరింపులా ? 
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల్లో సమస్యలు తలెత్తడంపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఎస్‌‌‌‌ఈ, నీట్ వంటి పరీక్షల నిర్వహణలో లోపాలు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్​ను అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయన్నారు.

లోపాలను సరిదిద్దడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ విద్యార్థులకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో లోపాలపై నిరసనలు చేపట్టిన విద్యార్థులపై కేసులు పెట్టడం తగదన్నారు. వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని.. ప్రశ్నిం చే ప్రతిపక్షా లను దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరిస్తూ పాలన సాగిస్తోందని సీఎం ఆరోపించారు. కేంద్రం 2014 నుంచి పలుమార్లు బలమైన నిరసనల కారణంగా వెనక్కి తగ్గిందని ఆయన గుర్తు చేశారు. అగ్రి చట్టాల విషయం లోనూ రైతుల పోరా టం తర్వాతే కేంద్రం దిగివచ్చిందన్నారు. ఈ విషయంలోనూ కేంద్రం స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోలే దని.. వీధులన్నీ రణరంగంగా మారిన తర్వాతే చర్యలు చేపట్టిందని విమర్శించారు. 

చట్టసభల్లోకి 21 ఏండ్లకే ఎందుకు రాకూడదు ? 
వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి.. చట్టసభల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సు తగ్గింపుపై సమగ్రంగా చర్చించి చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం అసెంబ్లీ, లోక్‌‌‌‌సభల్లో పోటీకి ఉన్న 25 ఏళ్ల వయోపరిమితిని 21 ఏండ్లకు, అలాగే శాసనమండలి, రాజ్యసభ సభ్యత్వానికి ఉన్న 30 ఏండ్ల వయోపరిమితిని 25 ఏండ్లకు తగ్గించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సూచించనుందని చెప్పారు.

రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. 70 ఏండ్ల క్రితం దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్న కాలంలో రూపొందించిన నిబంధనల ప్రకారం 21 ఏండ్లకు ఓటు హక్కు, 25 ఏండ్లకు అసెంబ్లీ-, లోక్‌‌‌‌సభ పోటీ అర్హతను నిర్ణయించారని తెలిపారు.

అయితే, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారని గుర్తుచేశారు. ఆ తర్వాత పీవీ నరసింహారావు హయాంలో 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించారన్నారు.

ఈ నిర్ణయం వల్ల అనేక మంది యువకులు క్షేత్రస్థాయిలో నాయకులుగా ఎదిగారని చెప్పారు. యువత 21 ఏండ్లకే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, అంతర్జాతీయ కంపెనీల్లో సీఈఓలుగా, వివిధ రంగాల్లో నూతన ఆవిష్కర్తలుగా విజయం సాధిస్తున్నారని.. అలాంటప్పుడు వారిని చట్టసభల విధాన నిర్ణయాల నుంచి దూరంగా ఉంచడం సరికాదన్నారు.