వడ్లు, మక్కలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే! జూన్ 15 దాకా గడువిస్తున్నాం.. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌

వడ్లు, మక్కలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే! జూన్ 15 దాకా గడువిస్తున్నాం.. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌
  • వడ్లు, మక్కలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే!
  • పంజాబ్, హర్యానాలో కొంటూ తెలంగాణలో ఎందుకు కొనరు?: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌
  • జూన్​ 15 దాకా గడువిస్తున్నాం.. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తం
  • వడ్లు, మక్కలు తీసుకొచ్చి బీజేపీ నేతల ఇండ్లు, పార్టీ ఆఫీసుల ముందు పోస్తం
  • తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ విషయంలో మహారాష్ట్ర సీఎం స్పందిస్తలే
  • ఏపీ కోసం 7 మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం 
  • మా కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించలేదా?  
  • ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి జోక్యం చేసుకోవాలే
  • రాష్ట్రంలో మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నం
  • ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఒక్క పూరి గుడిసె లేకుండా చేస్తం
  • సెప్టెంబర్​ 17 నాటికి మరో లక్ష ఇండ్లను నిర్మిస్తం 
  • ఆసిఫాబాద్​ జిల్లా కొఠారి గ్రామ బహిరంగ సభలో సీఎం ప్రసంగం
  • కొత్తగూడలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు


ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతుల నుంచి కొంటున్న వడ్లు, మక్కలను తీసుకోకపోతే కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు. ‘ఐ డోంట్​ కేర్​.. నేనెవర్నీ లెక్కచేయను.. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తా’నని చెప్పారు.  వడ్లు, మక్కల సేకరణపై కేంద్రానికి జూన్​ 15 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికీ స్పందించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.  తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ విషయంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్​ సరిగ్గా స్పందించడం లేదని, తెలంగాణ సీఎం అంటే ఎందుకంత చులకనభావమని ప్రశ్నించారు. ‘‘ఈ రెండు అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలి.. రాష్ట్రంలో ప్రభుత్వం సేకరించిన వడ్లను, మక్కలను తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించాలి.. తుమ్మిడిహెట్టి వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న 1500 ఎకరాలు ఇప్పించాలి..  అక్కడి రైతులు ఎంత నష్ట పరిహారం అడిగినా చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. లేదంటే  తెలంగాణలో కిషన్​రెడ్డి తిరగలేని పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించారు. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కొలాం కొఠారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్​ వెంకటస్వామి,  సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, గ్రామ సర్పంచ్ మడావి సంపాబాయితో కలిసి ప్రారంభించారు. అనంతరం​ అక్కడే నిర్వహించిన  బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్​ ప్రసంగించారు.


 ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  రాష్ట్రంలో కొత్తగా మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్​ 17 లోపు రాష్ట్రంలో మరో లక్ష ఇండ్లు  నిర్మాణాలు పూర్తి చేసి.. ప్రారంభోత్సవం చేస్తామన్నారు. తొలి విడత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి.. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లు అందించినట్టు చెప్పారు.  గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని గూడేలు, ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులైన వారికి అందించామని సీఎం చెప్పారు. ఏ గిరిజన గూడెంలోనూ ఇకపై గుడిసె అన్నదే  లేకుండా అందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తామని,  అర్హత గల ప్రతి ఒక్కరికీ ఇల్లు అందిస్తామని స్పష్టంచేశారు. గతంలో ప్రభుత్వ సాయంతో నిర్మించుకొని ఆగిపోయిన ఇండ్లు పూర్తిచేసుకునేందుకు సైతం ప్రభుత్వం తరఫున నిధులు అందజేస్తామన్నారు. పార్టీలకతీతంగా అన్ని నియోజకవర్గాల్లో గుడిసెల్లో ఉంటున్న లిస్టులు తయారు చేసి తమకు పంపించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.  

 ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో గుడిసె కనిపించొద్దు.. 

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాను అన్ని విధాలా అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని సీఎం రేవంత్‌‌‌‌ చెప్పారు.  ఐటీడీఏ  పరిధిలో పార్టీలకతీతంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టి అర్హత గల ప్రతి గిరిజన కుటుంబానికి ఇల్లు కేటాయించి నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.  ఇన్‌‌‌‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు 5 రోజులపాటు జిల్లాలో పర్యటించి.. గుడిసెలు ఉన్న వారి లిస్ట్​ రెడీ చేసి తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.  ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గ పరిధిలో గుడిసెలు ఉన్నవారి వివరాలు పంపించాలన్నారు. జిల్లా కలెక్టర్​, గృహనిర్మాణ శాఖ ఆఫీసర్ల సాయం తీసుకోవాలని సూచించారు.  ఈ దఫా ఇల్లు రానివారు ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని, అర్హత గల ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 

తుమ్మిడిహెట్టి​ విషయంలో  మహారాష్ట్ర సీఎం స్పందించట్లే

కేసీఆర్​ ప్రభుత్వం లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం.. కూలేశ్వరం అయిపోయిందిగానీ.. ఆదిలాబాద్  జిల్లాలో ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని సీఎం రేవంత్​ విమర్శించారు. అందుకే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనికోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌‌‌‌కు  లేఖ రాసినా ఆయన స్పందించడం లేదని చెప్పారు. ‘‘మహారాష్ట్ర సీఎంకు ఈ వేదిక మీదుగా విజ్ఞప్తి చేస్తున్నా..  మా బాధను, రైతుల అవసరాల్ని మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే  ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనై కదులుతుంది.  రైతులు ఉప్పెనై కదిలితే మహారాష్ట్రకు ఇబ్బందులు తప్పవు’’ అని సీఎం హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి పూర్తయితే గ్రావిటీతో లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించవచ్చన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గురుతర బాధ్యత ఉందని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు.. తెలంగాణ సీఎం అంటే చులకన భావంతో చూస్తున్నారు.  లక్షలాది మంది రైతుల పక్షాన కిషన్‌‌‌‌రెడ్డి దూతగా వ్యవహరించాలి. నాకు ఎలాంటి భేషజాలు లేవు.. అవసరమైతే మీ ఇంటికి రావడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.  మహారాష్ట్ర సీఎంతో మాట్లాడించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి సహకరించండి’’ అని రేవంత్​ విజ్ఞప్తిచేశారు. అక్కడి రైతులు ఎంత నష్టపరిహారం అడిగినా చెల్లిస్తామని చెప్పారు. ‘‘ఆనాడు  పోలవరం కోసం ఏపీకి ఏడు మండలాలను ఇచ్చిన మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాలు ఇప్పించలేదా? ’’ అని నిలదీశారు. తాము మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాస్తుంటే కిషన్‌‌‌‌రెడ్డి ఆలోచనేంటో  తెలియడం లేదని చెప్పారు.  ఆయన ఆలోచనేంటో ముందు బయటపెట్టాలన్నారు. ‘‘రైతు ప్రయోజనాల కోసం మోదీ అయినా.. కిషన్ రెడ్డి అయినా ఎవరినీ లెక్కచేయను ..ఐ డోంట్ కేర్ ఎనీ వన్.. నాకు రైతుల ప్రయోజనమే ముఖ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు.


వడ్లు, మక్కలు మీ ఇండ్ల ముందు పోస్తం!


రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొన్న వడ్లు, మక్కలను కేంద్రం తీసుకోవాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ‘‘జూన్​ 15 వరకు గడువిస్తున్నాం.. ఆలోగా కొనకపోతే కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని తెలంగాణలో తిరగనివ్వరు’’ అని హెచ్చరించారు. రైతుల నుంచి పంట ఉత్పత్తులను సేకరించడం రాష్ట్రాల పని కాగా.. వాటిని మద్దతు ధరకు కొనడం కేంద్రం విధి అని చెప్పారు. రాష్ట్రంలో యాసంగి సీజన్​లో ఇప్పటివరకు 75 లక్షల  టన్నుల వడ్లు, 40 లక్షల  టన్నుల మక్కలను, పొద్దు తిరుగుడు పంటను తమ ప్రభుత్వం సేకరించిందని చెప్పారు. కానీ ఈ ధాన్యాన్ని కొనడానికి కేంద్రం ముందుకు రావడంలేదన్నారు. పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో  కనీస మద్దతు ధర ప్రకటించి, ధాన్యం కొంటున్న కేంద్రం, తెలంగాణలో పండిన వడ్లు, మక్కలు మాత్రం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇందుకు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి.  కిషన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకోకుంటే జూన్ 15  తర్వాత ఆ వడ్లు, మక్కలు తీసుకొచ్చి మీ ఇళ్లు, మీ పార్టీ ఆఫీస్​ ముందు పోస్తాం’’ అని సీఎం హెచ్చరించారు.  జూన్ 15 తర్వాత ఎట్లా కొనరో చూస్తామని, ప్రభుత్వం తరఫున కార్యాచరణ ప్రకటిస్తామని, ఇందుకు రైతులంతా మద్దతుగా నిలవాలన్నారు. ‘‘రాష్ట్రంలో రైతులెవ్వరూ అధైర్యపడొద్దు..  ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది.. తడిసిన ప్రతీ గింజనూ సేకరిస్తది’’  అని  భరోసా ఇచ్చారు.