- తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్
- ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి
- తెలంగాణపై తేజస్వి చేసిన వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆవిర్భావంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తేజస్వి సూర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం మకర ద్వారం మెట్లపై ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామ సహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ నిరసన తెలిపారు. అంతకుముందు చామల, మల్లు రవి, గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి ఆందోళన చేపట్టారు.
‘తెలంగాణ గౌరవంతో బీజేపీ రాజకీయాలు చేయొద్దు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గౌరవించాలి, ‘తెలంగాణ ప్రజల త్యాగాలను హేళన చేయొద్దు, తెలంగాణ చరిత్రను బీజేపీ తప్పక గౌరవించాలి, తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి’అంటూ నినదించారు.
అప్పటికి తేజస్వి పుట్టనే లేదు..
మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎంపీ తేజస్వి సూర్య ఇంకా పుట్టనేలేదని, అవగాహన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఫైర్ అయ్యారు. తేజస్వి సూర్య, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కడియం కావ్య డిమాండ్ చేశారు. దశాబ్దాల ఉద్యమం, ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-, పాకిస్తాన్ విభజనతో పోల్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలను కిషన్ రెడ్డి సమర్థిస్తూ లోక్‌సభలో మాట్లాడారని, ఆయను తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని చామల కోరారు. బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీకి 8 లోక్‌సభ సీట్లు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అనంతరం లోక్‌సభలో తేజస్వి సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్‌ను కలిసి, విజ్ఞప్తి చేశారు. రికార్డులు పరిశీలించి తొలగిస్తామని స్పీకర్ తమకు హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు.

