తొలిరోజు గాంధీభవన్ లో అర్ధరాత్రి వరకూ బిజీబిజీగా మాణిక్ రావ్ ఠాక్రే

తొలిరోజు గాంధీభవన్ లో అర్ధరాత్రి వరకూ బిజీబిజీగా మాణిక్ రావ్ ఠాక్రే

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ బిజీబిజీగా గడిపారు. సీనియర్ నాయకులతో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. పీఏసీ మీటింగ్ లో కొంతమంది నేతలను ఠాక్రే హెచ్చరించారని తెలుస్తోంది. దేశం కోసం రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తుంటే.. మీరు గొడవలకు దిగడం మంచిదేనా ? అని ప్రశ్నించారని తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి.. రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలో చూడాలని ఆదేశించారు. 

విభేదాలు పక్కన పెట్టి కలిసి కట్టుగా పని చేయాలని కాంగ్రెస్ నేతలకు మాణిక్ రావు ఠాక్రే దిశానిర్దేశం చేశారు.  రెండు రోజల పర్యటన నిమిత్తం మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేద్దామని నేతలకు ఠాక్రే సూచించారు. ప్రతి పబ్లిక్ ఇష్యూను వదలకుండా పోరాటం చేయాలని నేతలకు చెప్పారు. ఈగోలతో కాకుండా ఇష్టంతో పని చేయాలని, మనమంతా కుటుంబ సభ్యులమేనని నేతలకు వివరించారు. ప్రతి నెల పార్టీలో డెవలప్మెంట్ కనిపించాలని మాణిక్ రావు ఠాక్రే నేతలకు  చెప్పారు. 

తొలిరోజు పార్టీ నాయకులతో సమావేశమైన మాణిక్ రావ్ ఠాక్రే అర్ధరాత్రి వరకు గాంధీభవన్ లోనే సమావేశాలు కొనసాగించారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గాంధీభవన్ లోనే ఠాక్రేతో ఉన్నారు. ఇటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు గాంధీభవన్ నుంచి కొద్దిసేపు బయటికి వెళ్లి వచ్చారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం పూర్తిగా గాంధీభవన్ లోనే గడిపారు.