V6 News

గ్రేటర్​వ్యాప్తంగా ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

గ్రేటర్​వ్యాప్తంగా ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

గ్రేటర్​వ్యాప్తంగా శుక్రవారం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా బల్దియా హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ లోకేశ్​కుమార్, అధికారులు పాల్గొన్నారు. వాటర్​బోర్డు హెడ్డాఫీసులో ఎండీ దానకిశోర్, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హెచ్ఎండీఏ ఆఫీసులో సెక్రటరీ చంద్రయ్య, కమాండ్​ కంట్రోల్ సెంటర్​లో జాయింట్ సీపీ, అడ్మిన్ పరిమళ, సైబరాబాద్ కమిషనరేట్​లో డీసీపీ రితిరాజ్, డీజీపీ ఆఫీసులో పర్సనల్ వింగ్ ఐజీ కమలాసన్ రెడ్డి, గండిపేటలోని రాష్ట్ర పోలీస్ అకాడమీలో డైరెక్టర్​ సందీప్ శాండిల్య జెండా ఎగురవేశారు.

కొంగరకలాన్​లోని రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఆవరణలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. మంత్రి సబితా రెడ్డి చీఫ్​గెస్టుగా అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆమన్​గల్, కడ్తాల్, శివరాంపల్లి, తలకొండపల్లి ప్రభుత్వ స్కూళ్ల నుంచి వచ్చిన స్టూడెంట్లు, స్టేట్ హోం చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.  శామీర్ పేటలోని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లో జరిగిన ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ అమోయ్​కుమార్ పాల్గొన్నారు.  కూకట్​పల్లి మున్సిపల్ ఆఫీసు ఆవరణలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జెండా ఎగురవేశారు. గాంధీ హాస్పిటల్​లో, బౌద్ధనగర్, బన్సీలాల్ పేట డివిజన్​లో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ట్యాంక్​బండ్​పై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ ఎల్. రమణ నివాళులర్పించారు.

రాజేంద్రనగర్​లోని అగ్రికల్చర్ వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఇన్​చార్జి వీసీ వెంకటరమణ పూలమాల వేసి నివాళులర్పించారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ సంబురాలు నిర్వహించారు. ఉద్యమకారులను సన్మానించారు. కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ విద్యాసాగర్​ రావు,  బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ  బూర నర్సయ్య గౌడ్, ప్రజాగాయకుడు గద్దర్ పాల్గొన్నారు.
– వెలుగు, హైదరాబాద్/రంగారెడ్డి/జీడిమెట్ల/మూసాపేట/పద్మారావునగర్/ముషీరాబాద్/గండిపేట/సీతాఫల్​మండి