- వర్సిటీల బీవోఎస్ అనుమతి లేదని బ్రేక్
- ఫీజులు వాపస్ ఇచ్చేందుకు కౌన్సిల్ సిద్ధం
- కొనసాగుతున్న మూడో విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టాలనుకున్న కొత్త కోర్సులపై స్పష్టత కరువైంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక కారణాలతో 11 కొత్త కోర్సులు ఈ విద్యాసంవత్సరానికి అటకెక్కేలా కనిపిస్తున్నాయి. దోస్త్ మూడో విడుత కౌన్సెలింగ్ మొదలైనా ఆయా కోర్సులకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనుమతి లేదని కమిషనరేట్ అధికారులు దోస్త్ పోర్టల్‌లో ఇప్పటికీ చేర్చలేదు.
కొత్త కోర్సులకు బీవోఎస్ అనుమతి లేదు..!
డిగ్రీలో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా 11 కొత్త కోర్సులను తీసుకురావాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీని కోసం దాదాపు 67 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్కో కాలేజీ మూడు నుంచి నాలుగు కోర్సుల వరకు ఆప్షన్లు ఇచ్చుకున్నాయి. దీనికి కాలేజీ యాజమాన్యాలు నిర్ణీత ఫీజును కూడా కౌన్సిల్‌కు చెల్లించాయి. అయితే, వర్సిటీల బీవోఎస్ అనుమతి లేదని చెబుతూ అధికారులు ఈ కోర్సులను డిగ్రీ కౌన్సెలింగ్‌లో పెట్టలేదు. ఈ విషయంలో కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి, కమిషనరేట్ అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయా కోర్సులకు బీవోఎస్ అనుమతి ఉందని చైర్మన్ స్పష్టం చేస్తుండగా.. వర్సిటీల వారీగా విడివిడిగా పర్మిషన్ పత్రాలు ఉంటేనే దోస్త్ పోర్టల్‌లో చేరుస్తామని కమిషనరేట్ అధికారులు భీష్మించుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కౌన్సిల్ చైర్మన్.. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంవో సెక్రటరీ అజిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో కొత్త కోర్సులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొదలైన దోస్త్ థర్డ్ ఫేజ్ షెడ్యూల్..
డిగ్రీ అడ్మిషన్ల కోసం ఇప్పటికే మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. గత నెల 31 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, ఈ నెల 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా, మొదటి రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,302 మంది విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు అలాట్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కోర్సులకు అనుమతి లభించే సూచనలు కనిపించకపోవడంతో విద్యార్థులు పాత కోర్సుల్లోనే చేరాల్సి వస్తోంది.
డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం..
కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల ప్రతినిధులు వస్తే నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఒకవేళ కోర్సుల నిర్వహణ సాధ్యం కాకపోతే, అప్లై చేసే సమయంలో కాలేజీలు చెల్లించిన ఫీజును తిరిగి రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు.
