పార్లమెంటునే కాపాడలేనోళ్లు దేశాన్ని కాపాడ్తరా: భట్టి విక్రమార్క

పార్లమెంటునే కాపాడలేనోళ్లు దేశాన్ని కాపాడ్తరా: భట్టి విక్రమార్క
  • ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన
  • దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదుల్తయ్: పొన్నం ప్రభాకర్
  • నియంత కేసీఆర్‌‌‌‌కు బుద్ధి చెప్పినట్టే బీజేపీకీ చెప్పాలి: శ్రీధర్ బాబు
  • పార్లమెంట్‌‌పై అటాక్ అంబేద్కర్ గుండెపై దాడే: కూనంనేని
  • ఎంపీల సస్పెన్షన్​ దారుణం: కోదండరాం

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే అణచివేస్తున్నదని, అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తున్నదని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. పార్లమెంట్‌‌లో స్మోక్‌‌ అటాక్‌‌ ఘటనపై స్పందించాలని అడిగినందుకు.. లోక్‌‌సభ, రాజ్యసభ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటునే కాపాడలేనోళ్లు దేశాన్ని ఏం కాపాడుతారని నిలదీశారు. నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో.. కేంద్ర ప్రభుత్వానికీ అలాగే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్లమెంటుపై స్మోక్ అటాక్, ఉభయ సభల నుంచి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఇండియా కూటమి (కాంగ్రెస్, సీపీఐ, ఆప్, టీజేఎస్‌‌) పార్టీలు ధర్నా చేశాయి. 

రాజ్యాంగంపై దాడి చేయడమే: భట్టి

దేశ పార్లమెంట్‌‌పై దాడి చేయడమంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.స్మోక్ అటాక్ ఘటనపై సభలో స్పందించాలని అడిగినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. దేశ పార్లమెంటునే కాపాడుకోలేని బీజేపీ పాలకులు దేశాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. దేశ రక్షణను ప్రధాని నరేంద్ర మోదీ గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. ‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే పార్లమెంటులో జరిగిన దాడిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పకుండా సభ్యులను సస్పెండ్ చేయడం సిగ్గుచేటు. ఈ దాడితో ప్రపంచంలో దేశం విలువ ఎంతలా దిగజారిందో ప్రజలు ఆలోచించాలి. అసలేమీ జరగలేదన్నట్టుగా మోదీ, అమిత్ షాలు మౌనంగా ఉంటూ కార్యకలాపాలు సాగిస్తుండడం బాధాకరం” అని అన్నారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. ‘‘ప్రశ్నిస్తే కేసులు.. పార్లమెంట్ నుంచి బహిష్కరణ.. స్వేచ్ఛ, భావ ప్రకటన లేకుండా నియంతృత్వ పోకడలతో మోదీ పాలన సాగుతున్నదనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనం. ఎన్నికల ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న ఘటనలను సృష్టించి.. ప్రజల్లో భావోద్రేకం తీసుకొచ్చి.. అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అంతేతప్ప రాజ్యాంగాన్ని కాపాడాలన్న ఆలోచన బీజేపీకి లేదు’’ అని భట్టి మండిపడ్డారు.

అత్యంత సిగ్గుమాలిన చర్య : శ్రీధర్ బాబు

నియంతృత్వ పోకడలతో ప్రతిపక్ష ఎంపీలను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం అత్యంత సిగ్గుమాలిన చర్య అని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం కనీస భద్రత ఇవ్వలేకపోయిందని, వీళ్లు దేశాన్నేం కాపాడుతారని నిలదీశారు. నియంతృత్వ పోకడలతో చట్టాలను రూపొందిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నియంత పాలన చేసిన కేసీఆర్​కు ప్రజలు బుద్ధి చెప్పారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

బీజేపీని కూడా ఎత్తేస్తరు: జూపల్లి కృష్ణారావు

దేశం బాగుపడాలని నెహ్రూ, ఇందిర, రాజీవ్ లాంటి పెద్దలు ప్రయత్నాలు చేస్తే.. పదేండ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కూల్చే ప్రయత్నాలు చేస్తున్నదని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కులాలు, మతాల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ కల్లోలం సృష్టిస్తున్నదని, మతాల మధ్య చిచ్చు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజలను అణచివేసినందుకు కేసీఆర్​ను రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఎత్తిపారేశారని, ఇప్పుడు ఎంపీలను సభ నుంచి ఎత్తేసిన బీజేపీని కూడా ప్రజలకు బయటకు ఎత్తేస్తారని హెచ్చరించారు. ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. 

హిట్లర్, ముస్సోలినిలా ప్రవర్తించిన్రు: కూనంనేని

పార్లమెంట్‌‌‌‌పై దాడి అంటే అంబేద్కర్ గుండెపై దాడి జరిగినట్టేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దాడికి కారణం అడిగితే ప్రధాని, హోం మంత్రి.. హిట్లర్, ముస్సోలినిల్లాగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. వాళ్లు జైలుకు వెళ్లడం తప్పదని హెచ్చరించారు. ‘‘ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీయే. ఆయన్ను సస్పెండ్ చేస్తారా? రాహుల్ గాంధీ ఏమన్నారని నాడు సస్పెండ్ చేశారు? ప్రశ్నించారని తృణమూల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు” అని చెప్పారు. మోదీ తప్పులను ఎండగట్టేందుకు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. 

కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలి: పొన్నం

ఎంపీలను సస్పెండ్ చేసిన తీరు నియంతృత్వాన్ని తలపిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పార్లమెంటుపై స్మోక్‌‌‌‌ అటాక్ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల్సిందిపోయి, ప్రధాని సమాధానం చెప్పాల్సిందిపోయి.. ఎంపీలను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్‌‌‌‌పై అటాక్ జరిగితే మోదీ ఇంతవరకు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ‘‘నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో.. కేంద్ర ప్రభుత్వానికీ అలాగే బుద్ధి చెప్తరు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయి. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం పరువు పోయింది: కోదండరాం

పార్లమెంట్‌‌‌‌పై దాడి ఘటనతో ప్రపంచం ముందు దేశ పరువు పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఎంపీలను సస్పెండ్ చేసిన ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు రాశాయన్నారు. దాడి ఘటనపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఎంపీలను రివర్స్​లో సస్పెండ్ చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలను బయటకు పంపి కీలకమైన బిల్లులను ఏకపక్షంగా పాస్ చేశారని, అది ప్రజాస్వామ్యానికే మచ్చ అని విమర్శించారు. ఎంపీల సస్పెన్షన్​ను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.