హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డైట్, ఎస్సీఈఆర్టీ, సీటీఈ, ఐఏఎస్‌ఈ తదితర విద్యా శిక్షణ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్‌పై భర్తీ చేసేందుకు నిర్వహించిన రాత పరీక్షలు పూర్తయ్యాయి. జులై 30, 31 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ తదుపరి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆగస్టు 4న రాత పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేసి, ఆగస్టు 5 నుంచి 7 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉండగా.. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూ కమ్ డెమోన్స్ట్రేషన్ (బోధనా నైపుణ్య ప్రదర్శన)కు 20 మార్కులు కేటాయించారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 11న డిప్యూటేషన్ ఉత్తర్వులు అందజేయనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.
