ఉద్యోగుల జీతాల్లో కోతలు కరెక్ట్ కాదు..మే నెల వేతనాల్లో 1.5 శాతం కోతపై టీచర్ల సంఘాల ఆగ్రహం 

ఉద్యోగుల జీతాల్లో కోతలు కరెక్ట్ కాదు..మే నెల వేతనాల్లో 1.5 శాతం కోతపై టీచర్ల సంఘాల ఆగ్రహం 

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండా, విధివిధానాలు ఖరారు కాకముందే మే నెల వేతనాల నుంచి 1.5 శాతం కోత విధించడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కనీసం ఆసుపత్రుల జాబితా కానీ, ప్యాకేజీ ధరలు కానీ ప్రకటించకుండా జీతాల్లో కోతలు విధించడం ఆర్థిక శాఖ అత్యుత్సాహమేనని సీపీఎస్ఈయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఆర్‌‌యూపీపీ, తపస్, డీటీఎఫ్, టీఎస్టీయూ తదితర సంఘాలు ఆరోపించాయి. అసలు హెల్త్ కార్డులే చేతికి అందకముందే రికవరీ మొదలుపెట్టడంపై ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు.

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఉద్యోగి సమ్మతి లేకుండా జీతంలో కోత విధించడం ఆర్టికల్ 300ఏ ప్రకారం ఆస్తి హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైన సందర్భాల్లో ఒకరికే మినహాయింపు ఉండాలన్న ప్రాథమిక నిబంధనను పక్కనపెట్టి ఇద్దరికీ కోత విధించడం, సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతపై స్పష్టత ఇవ్వకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో కుటుంబ సభ్యుల నమోదు ప్రక్రియ కూడా పూర్తికాక ముందే కోతలు విధించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అప్రకటిత కోతలను నిలిపివేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు న్యాయపోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘాల నేతలు హెచ్చరించారు.