- ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సర్కారు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 13వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఆ శాఖ డైరెక్టర్ శృతి ఓఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచే అంగన్‌వాడీలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి.
అయితే జూన్ నెలలోనూ ఎండల తీవ్రత తగ్గకపోవడంతో సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈనెల 13 వరకు సెలవులు ఉండనున్నాయి. 14న ఆదివారం కావడంతో, 15వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అంగన్‌వాడీల ద్వారా ఇచ్చే సరుకులను ‘టేక్ హోమ్ రేషన్’ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే అందజేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. దీనివల్ల చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం నిరంతరంగా అందుతుందని పేర్కొన్నారు.
