
యూనివర్సిటీ కాన్వొకేషన్ లో స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్, పట్టాలు ప్రదానం
హైదరాబాద్, వెలుగు: హార్టికల్చర్ లో రాష్ట్రం నంబర్ వన్ గా ఎదుగుతున్నదని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఈ రంగంలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నా ఉత్పత్తి, ఆదాయంలో గణనీయమైన వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీ నాలుగో కాన్వొకేషన్ నిర్వహించారు. గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో హార్టికల్చర్ సాగుభూమి 7 శాతమే ఉన్నా.. 34 శాతం ఉత్పత్తి జరుగుతున్నదని తెలిపారు. ఉద్యానసాగు 12.94 లక్షల ఎకరాల్లో జరుగుతుండగా 61.64 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నామని చెప్పారు. మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో, పసుపు ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. మామిడి ఎగుమతులు అంతర్జాతీయంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్‌భవన్ దత్తత తీసుకున్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తిలో హార్టికల్చర్ వర్సిటీ సాంకేతిక సహకారంతో మిర్చి, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించామని వెల్లడించారు.
అమెరికాలోని ఆబర్న్ వర్సిటీలో ఎంఎస్ చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం, హార్టికల్చర్ వర్సిటీ ప్రారంభించిన ఓవర్సీస్ ఫెలోషిప్ ప్రోగ్రాంను గవర్నర్ ప్రశంసించారు. ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ భారత్ ఒకప్పుడు ఆహార కొరత ఎదుర్కొనే పరిస్థితి నుంచి నేడు స్వయంసమృద్ధి సాధించిందన్నారు. అంతేకాకుండా విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరిందన్నారు. హార్టికల్చర్ వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ వర్సిటీ విద్య, పరిశోధన, విస్తరణలో సాధించిన విజయాల గురించి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్ , సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.