- ఆగస్టు15, డిసెంబర్ 30, ఫిబ్రవరి 28న నిధుల జమ
- నేరుగా స్టూడెంట్స్ బ్యాంకు ఖాతాల్లోకే నగదు
- పైసలు పడ్డ వారం రోజుల్లో కాలేజీకి కట్టాల్సిందే
- లేకపోతే ‘రికవరీ’ చర్యలు తీసుకునే చాన్స్
- 75శాతం అటెండెన్స్ ఉంటేనే ఫీజు రీయింబర్స్ మెంట్
- మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఏడాదికి మూడు నిర్ణీత సమయాల్లో నిధులను విడుదల చేసేలా సరికొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అడ్మిషన్ల సమయాన్ని అనుసరించి ఏ విద్యార్థికి ఏ నెలలో ఫీజు అందుతుందో స్పష్టతనిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటిదాకా కాలేజీల అకౌంట్లలో వేస్తున్న ఫీజులను.. ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే వేయనున్నది. 2026–-27 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులందరికీ ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయి. అయితే, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏప్రిల్ 26న సర్కారు ఇచ్చిన జీవో 7ను రద్దు చేసి, కొత్త గైడ్‌లైన్స్ కోసం జీవోలు 8,9 తీసుకొచ్చారు.
అడ్మిషన్ల ఆధారంగా మూడు విడతల్లో..
విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న గడువును బట్టి మూడు విడతల్లో ప్రభుత్వం నిధులను రిలీజ్ చేస్తుంది. మొదటి విడతలో ఏప్రిల్1 నుంచి జూలై 31 మధ్య అడ్మిషన్లు పొంది దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 15న ఫీజు డబ్బులు విడుదలవుతాయి. రెండో విడతలో ఆగస్టు1 నుంచి నవంబర్ 30 లోపు అప్లై చేసుకున్న వారికి డిసెంబర్ 30న నిధులు జమ చేస్తారు. మూడో విడతలో డిసెంబర్ 1 నుంచి జనవరి 31 లోపు దరఖాస్తు చేసిన వారికి ఫిబ్రవరి 28న ఫీజు అందుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లేట్ అడ్మిషన్లు పొందిన వారికి దరఖాస్తు చేసిన 75 రోజుల్లోపు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాలేజీకి ఫీజు చెల్లిస్తేనే మెయింటెనెన్స్
సర్కారు నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయనుండటంతో, ఆ ఫీజును కాలేజీకి కట్టే బాధ్యతను విద్యార్థులకే అప్పగించింది. ఆధార్ లింక్ అయిన అకౌంట్‌లో డబ్బులు పడిన ఏడు పనిదినాల్లోపు విద్యార్థి సంబంధిత కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఒకవేళ ఆ డబ్బులను విద్యార్థులు కాలేజీకి కట్టకుండా ఇతర అవసరాలకు వాడుకుంటే, వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరించింది. ఫీజు కట్టినట్టు విద్యార్థి కన్ఫర్మ్ చేస్తేనే తదుపరి విడుత మెయింటెనెన్స్ ఫీజు నిధులు ఖాతాలో పడతాయి. అయితే, రెండో ఏడాది నుంచి స్కాలర్‌షిప్ రెన్యూవల్ చేసుకోవడం గతంలో పెద్ద ప్రహసనంగా ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, 2026 – 27 నుంచి ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు.. తర్వాతి ఏడాదికి ఆటోమేటిక్‌గా రెన్యూవల్ అయ్యేలా ఆటో-రెన్యూవల్ సిస్టమ్ తీసుకొచ్చారు.
ఆదాయ పరిమితి రూ.2.50 లక్షల లోపు
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. స్కాలర్‌షిప్ కావాలంటే విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు 75 శాతం ఉండాల్సిందే. ఫేక్ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిబంధన తెచ్చారు. ఇక ఆదాయ పరిమితి విషయానికొస్తే.. అన్ని కేటగిరీల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు ఉండాలి. ఈ-పాస్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొత్తం ఆన్‌లైన్‌లోనే (ఆటో-వెరిఫికేషన్) పూర్తవుతుంది. దీంతో విద్యార్థులు కాలేజీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. కాలేజీల్లో ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించి ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎంటీఎఫ్ కూడా ఖరారు
హాస్టల్ ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఇచ్చే మెయింటెనెన్స్ ఫీజు (ఎంటీఎఫ్) రేట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ చదివే వారికి కాలేజీ అటాచ్‌డ్ హాస్టల్‌లో ఉంటే నెలకు రూ.1,500, డే స్కాలర్లకు రూ.650 చొప్పున ఇస్తారు. డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ అయితే రూ.1,000, డే స్కాలర్లకు రూ.500.. ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ అయితే రూ.750, డే స్కాలర్లకు రూ.500 చొప్పున పది నెలల పాటు ఈ మొత్తాన్ని ఇస్తారు. ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకు అన్ని కేటగిరీల్లో అదనంగా మరో 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.
