- రోడ్ కాంట్రాక్టర్ నుంచి రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత
భద్రాచలం/పెద్దపల్లి, వెలుగు: రోడ్డు కాంట్రాక్టర్ నుంచి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ భద్రాచలం ఎఫ్డీఓ సుజాత, చర్ల ఎఫ్ఆర్ఓభూక్యా కృష్ణ గురువారం ఏసీబీకి పట్టుకున్నారు. చర్ల మండలం పూసుగుప్ప నుంచి చత్తీస్ గఢ్ బార్డర్ వరకు రోడ్డు నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్ కు టెండర్ దక్కింది. రోడ్డు నిర్మాణంలో భాగంగా అటవీ ప్రాంతంలోని కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. దీంతో కాంట్రాక్టరుపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని ఎఫ్ డీఓ సుజాత, ఎఫ్ఆర్ఓ కృష్ణ డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తికాగానే డబ్బుల కోసం వారు కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చారు. రోడ్డు నిర్మాణంలో చెట్లు నరికినందుకు ముందుగా అనుకున్న మొత్తంలో లంచం ఇవ్వాలని పట్టుపట్టారు. అయితే, తాను అంత డబ్బు ఇవ్వలేనని కాంట్రాక్టర్ చెప్పగా.. చివరకు రూ.3.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సుజాత, భూక్యా కృష్ణ.. ఆ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు.
పెద్దపల్లిలో పంచాయతీ కార్యదర్శి
ఫోన్ పేలో రూ.5 వేలు లంచం తీసుకున్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి.. ఏసీబీకి చిక్కాడు. రెండేళ్ల కింద ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అనుమతి ఇచ్చేందుకు జీపీ కార్యదర్శి రూ. 20 వేలు డిమాండ్ చేశాడు. కొద్ది రోజుల క్రితం బాధితుడు రూ. 15 వేలు ఇచ్చినా అనుమతి మంజూరు చేయలేదు. మిగిలిన రూ.5 వేలు ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం బాధితుడు రూ.5 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. పొత్కపల్లి జీపీ ఆఫీసులో ఉన్న కుమారస్వామిని పట్టుకున్న ఏసీబీ అధికారులు.. అతని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కుమారస్వామిని అరెస్టు చేసి ఏసీబీ కోర్డులో ప్రవేశపెట్టనున్నారు.
