టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు. అలాంటిది ఇద్దరు దిగ్గజ హీరోరో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ కు ఫూనకాలే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ ' మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అదే ఊపుతో ఉన్న చిరు మరో సారి రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి తన చిరకాల స్నేహితుడు , కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
చిరు-నాగ్ కాంబోలో..
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు సక్సెస్‌ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది..
యాక్షన్ , కామెడీతో..
అంతే కాదు ఇప్పటికే కథకు గ్రీన్ సిగ్నల్ పడిందని, ప్రస్తుతం స్క్రీన్‌ప్లే పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు, నాగార్జున క్లాస్ అండ్ స్టైలిష్ ఇమేజ్‌కు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా కథను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా.. కుటుంబ భావోద్వేగాలు, నవ్వులు పంచే కామెడీ, అభిమానులు విజిల్స్ వేయించే మాస్ ఎలివేషన్స్‌తో అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇద్దరు దిగ్గజాల ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా పాత్రలు ఉండబోతున్నాయనే టాక్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతోంది.
ఫుల్ బిజీగా హీరోస్..
ప్రస్తుతం చిరంజీవి వరుస కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉండగా, నాగార్జున కూడా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తే అది తెలుగు సినిమా చరిత్రలో మరో ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు చిరంజీవి, నాగార్జున, అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఇది ప్రస్తుతం ప్రచారానికే పరిమితమైనప్పటికీ ఈ వార్త నిజమైతే మాత్రం తెలుగు సినీ అభిమానులకు ఇది పండుగ వార్తే. మెగాస్టార్ మాస్, కింగ్ క్లాస్, అనిల్ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్ ఒకే సినిమాలో కలిస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం నమోదవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
