తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఇవాళ(జూన్2) పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా చర్యలు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన

పద్మారావునగర్, వెలుగు : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేయనున్నట్లు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుకల్లో పాల్గొననున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్‌‌‌‌కు వెళ్లే వాహనాలు ప్యాట్నీ–క్లాక్‌‌‌‌టవర్–సంగీత్ మార్గంలో, తిరుమలగిరి వెళ్లేవారు ఫ్లైఓవర్–సెయింట్ జాన్స్ రోటరీ– షేనాయ్– ఏఓసీ – కేవీ మార్గంలో వెళ్లాలి. సంగీత్ జంక్షన్ నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలను క్లాక్‌‌‌‌టవర్ – ప్యాట్నీ – ఘాస్‌‌‌‌మండి – కర్బలా – ట్యాంక్‌‌‌‌బండ్ – ఖైరతాబాద్ మార్గంలోకి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వెళ్లేవారు క్లాక్‌‌‌‌టవర్–సంగీత్–సెయింట్ జాన్స్ రోటరీ–షేనాయ్–ఏఓసీ–కేవీ మార్గంలో, బోయిన్‌‌‌‌పల్లి వెళ్లేవారు క్లాక్‌‌‌‌టవర్–ప్యాట్నీ–ప్యారడైజ్–సీటీవో–బోయిన్‌‌‌‌పల్లి మార్గంలో వెళ్లాలి. బోయిన్‌‌‌‌పల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను బ్రూక్‌‌‌‌బాండ్–టివోలీ–స్వీకార్ ఉప్కార్–వైఎంసీఏ మార్గంలోకి మళ్లిస్తారు. 

ట్యాంక్​బండ్​ నుంచి మళ్లింపులు ఇలా..

ట్యాంక్‌‌‌‌బండ్ నుంచి తిరుమలగిరి వెళ్లేవారు ప్యారడైజ్–సీటీవో–తాడ్‌‌‌‌బండ్–డైమండ్ పాయింట్–బోయిన్‌‌‌‌పల్లి మార్గంలో, తిరుమలగిరి నుంచి ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌కు వెళ్లేవారు ఎన్‌‌‌‌సీసీ–పికెట్–స్వీకార్ ఉప్కార్ – వైఎంసీఏ – క్లాక్‌‌‌‌టవర్ – ప్యాట్నీ – ఘాస్‌‌‌‌మండి – కర్బలా – ట్యాంక్‌‌‌‌బండ్ మార్గంలో వెళ్లాలి.

భారీ వాహనాలకు నో ఎంట్రీ..

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పరేడ్ గ్రౌండ్స్ వైపు వచ్చే మార్గాల్లోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. నగర ప్రజలు సాధ్యమైనంత వరకు మెట్రో రైలు, ఇతర ప్రజారవాణా సేవలను వినియోగించుకోవాలని కోరారు. రోడ్లపై వాహనాలను పార్క్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్‌‌‌‌కు సంబంధించిన వివరాల కోసం 8712662999 హెల్ప్‌‌‌‌లైన్ నంబర్‌‌‌‌ను సంప్రదించాలని సూచించారు.

1,140 మంది పోలీసులతో బందోబస్తు

నేరేడ్​మెట్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌లో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డితో పాటు సుమారు 6 వేల మంది ఆహ్వానితులు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో మొత్తం 1,140 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు. 

లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సీఎస్‌‌‌‌డబ్ల్యూ, ఏఆర్ విభాగాలతో పాటు నాలుగు ప్లాటూన్ల టీజీఎస్‌‌‌‌పీ బలగాలు భద్రతా బాధ్యతలు నిర్వహించనున్నాయి. ముగ్గురు డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 49 మంది ఇన్‌‌‌‌స్పెక్టర్లు, 88 మంది ఎస్‌‌‌‌ఐల ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగనుంది. ఆక్టోపస్, ఎస్‌‌‌‌వోటీ, ఇంటిలిజెన్స్ విభాగాలతో పాటు బాంబ్​ స్క్వాడ్​ దళాలు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లను కూడా మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌తో పాటు పరిసర ప్రాంతాల్లో 55 సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. 

పాస్​ ఉంటేనే  వేదిక వద్దకు అనుమతి..

కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితులు ఉదయం 7.30 గంటలలోపు వేదికకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తమకు కేటాయించిన పాస్‌‌‌‌లకు అనుగుణంగా నిర్దేశిత గేట్ల ద్వారానే ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు. ఒరిజినల్ ఆహ్వాన పత్రిక లేదా పాస్‌‌‌‌ను వెంట తీసుకురావాలని, తనిఖీల అనంతరం ప్రవేశానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆయుధాలు, పదునైన వస్తువులు, పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లేజర్ లైట్లు వంటి నిషేధిత వస్తువులను అనుమతించబోమన్నారు. వాహనాల పార్కింగ్ కోసం జింఖానా గ్రౌండ్, బైసన్ పోలో గ్రౌండ్, ఎంఈఎస్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణం, సెంటినరీ హైస్కూల్ సమీప ప్రాంతాలను ప్రత్యేకంగా కేటాయించినట్లు అధికారులు తెలిపారు.