- ప్రాజెక్టుల్లో వ్యయం పెంపు, జాప్యం నివారణకు సర్కారు చర్యలు
- స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ చైర్మన్‌గా 12 మంది సభ్యులతో కమిటీ
- నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ పనుల విధానం, ప్రాజెక్టుల సవరించిన పరిపాలనా ఆమోదాలు, గడువు పొడిగింపులు, తాత్కాలిక చెల్లింపులతో ప్రభుత్వ ఖజానాపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్ శాఖలు చేపడుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రిపరేషన్ దశ నుంచి పనుల పూర్తి వరకు అమలులో ఉన్న చట్టపరమైన, నిబంధనల, పరిపాలనాపరమైన వ్యవస్థను సమగ్రంగా సమీక్షించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ సభ్య కన్వీనర్‌గా 12 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి తన సమగ్ర నివేదికను, సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది.
వ్యవస్థాగత లోపాలు.. ఖజానాపై ఆర్థిక ఒత్తిడి
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో వివిధ ఇంజినీరింగ్ శాఖలు చేపడుతున్న పనులలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం తీవ్ర ఆర్థిక నష్టాలకు దారితీస్తోందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. డీపీఆర్ తయారీ, క్షేత్రస్థాయి భూసర్వేలు, డిజైన్ల ఖరారు, భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతుల సేకరణలో తీవ్ర లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనికితోడు కాంట్రాక్టుల నిర్వహణ, కొనుగోళ్ల విధానంలో పారదర్శకత కొరవడటంతో పనుల పూర్తి ఆలస్యమవుతోందని, ఫలితంగా ప్రాజెక్ట్ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయి ఖజానాపై ఊహించని భారం పడుతోందని పేర్కొంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించడమే కాకుండా, ప్రాజెక్టులు సమయానికి పూర్తయ్యేలా చూడటానికి నిబంధనలను బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
కమిటీ బాధ్యతలు.. విస్తృత పరిశీలన అంశాలు
ఈ ఉన్నత స్థాయి కమిటీకి అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. నీటిపారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ పరిపాలన సహా అన్ని ఇంజినీరింగ్ శాఖలకు వర్తించేలా ఒకే రకమైన నమూనా టెండర్, కాంట్రాక్ట్ పత్రాలను సిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. టెండర్లు పిలిచే ముందే డిజైన్లు పూర్తి కావడం, అవసరమైన భూమి లభ్యతలో ఉండటం, బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా ఉండటం వంటివి సరిచూసే ప్రాజెక్ట్ సన్నద్ధత తనిఖీ వ్యవస్థను రూపొందించనున్నారు.
కొత్త చట్టం తయారీ..
కోడ్‌ల పునర్నిర్మాణం ప్రభుత్వ ఆదేశాలకే పరిమితం కాకుండా ఈ సమీక్షా సిఫార్సులకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అందుకోసం ప్రజా పనుల ఆమోదం, టెండర్లు, కాంట్రాక్టులు, ఆర్థిక నిర్వహణను శాసించేలా ఒక ప్రత్యేక రాష్ట్ర చట్టం ముసాయిదాను రూపొందించే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలవుతున్న పాత తెలంగాణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కోడ్, తెలంగాణ ఫైనాన్షియల్ కోడ్‌లను మార్చి, ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ఒకే సరళమైన, ఏకీకృత విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
