అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు : మంత్రి తుమ్మల

అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక తనిఖీలు : మంత్రి తుమ్మల
  •     ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు
  •     రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పనితీరును మెరుగుపరిచి, రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడటంతో పాటు మార్కెట్లలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తెలిపారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శక లావాదేవీలను ప్రోత్సహించడం, ప్రభుత్వ రాబడిని పరిరక్షించడమే ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.  ఈ మేరకు ఆదివారం మంత్రి తుమ్మల మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఈ బృందాలను నియమించారు. మార్కెటింగ్ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేసే ఈ టీమ్‌‌‌‌‌‌‌‌లు, ఈ వారం నుంచే రాష్ట్రంలోని వివిధ మార్కెట్ కమిటీలను యాదృచ్ఛికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతాయి.

తనిఖీ బృందాల ప్రధాన బాధ్యతలు

మార్కెట్ కమిటీల పరిపాలన, నిర్వహణతో పాటు పంట విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర కొనుగోలు ప్రక్రియలో ఉన్న లోపాలను క్షేత్రస్థాయిలో ఈ తనిఖీ బృందాలు గుర్తించనున్నాయి. ముఖ్యంగా వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందో లేదో తనిఖీ చేయడంతో పాటు రైతులకు సకాలంలో చెల్లింపులు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాయి. 

మార్కెట్ సెస్ ఎగవేతను అరికట్టడం, డిజిటల్ సేవల అమలు, రికార్డుల నిర్వహణ,  రైతులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను ఈ బృందాలు సమగ్రంగా పరిశీలిస్తాయి. ఈ ప్రత్యేక బృందాలు ప్రతి వారం తమ తనిఖీ నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి. నివేదికల్లో గుర్తించిన లోపాలు, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు, విధానపరమైన సంస్కరణలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శితో కలిసి వచ్చే వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.