రూ.1000 కోట్లతో గోదావరి పుష్కరాలు..కాశీ, ప్రయాగ్‌‌‌‌రాజ్ తరహాలో ఘాట్ల సుందరీకరణ!

రూ.1000 కోట్లతో గోదావరి పుష్కరాలు..కాశీ, ప్రయాగ్‌‌‌‌రాజ్ తరహాలో ఘాట్ల సుందరీకరణ!
  • కందుకుర్తి నుంచి భద్రాచలం వరకు భారీ ఏర్పాట్లు 
  • 96 పుష్కర ఘాట్ల గుర్తింపు.. 20 చోట్ల శాశ్వత నిర్మాణాలకు ప్లాన్
  • 12  కన్సల్టెన్సీలకు పనుల బాధ్యతలు
  • వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రయాగ్‌‌‌‌రాజ్‌‌‌‌లోని ‘నమో ఘాట్ల’ తరహాలో గోదావరి తీరాన్ని రూ. 1000 కోట్లతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. నిజామాబాద్ జిల్లా కందుకుర్తి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వరకు ప్రవహించే గోదావరి నది తీరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సందర్భంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. 2015 పుష్కరాలకు 5 కోట్ల మంది భక్తులు రాగా.. ఈసారి ఆ సంఖ్య మూడింతలు పెరిగి దాదాపు 15 కోట్ల మంది వరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రూ.1000 కోట్ల నిధుల పనులిలే..

పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులను కేటాయించింది. గోదావరి ప్రవహించే 8 జిల్లాల్లో 96 పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో 20 ప్రధాన ఘాట్ల వద్ద శాశ్వత ప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. పనులను వేగంగా పూర్తి చేసేందుకు 12 ప్రత్యేక కన్సల్టెన్సీలను ఎంపిక చేసి, డిజైన్ల రూపకల్పన బాధ్యతలను అప్పగించారు. రూ. 1000 కోట్ల నిధులను వివిధ శాఖలకు విభజించారు. ఘాట్లకు రోడ్ల కనెక్టివిటీ, వంతెనల నిర్మాణం, గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ కి రూ.500 కోట్లు కేటాయించారు.  

ఘాట్ల నిర్మాణం, రక్షణ గోడలు, సుందరీకరణ, ప్రవేశ ద్వారాల వద్ద అత్యాధునిక ఆర్చీల ఏర్పాటు కోసం నీటిపారుదల శాఖకు రూ.290 కోట్లు అలాట్ చేశారు. ఘాట్లకు సమీపంలోని ఆలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక ఏర్పాట్లకు దేవాదాయ శాఖకు రూ.145 కోట్లు కేటాయించారు. ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల కోసం పోలీస్ శాఖకు రూ.45 కోట్లు ఇవ్వనున్నారు. 'టెంట్ సిటీ'ల నిర్మాణం, వసతి గృహాల కల్పనకు పర్యాటక శాఖకు రూ.20 కోట్లు అలాట్ చేశారు. 

భక్తుల కోసం అత్యాధునిక వసతులు

పుష్కరాల్లో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం ప్రధాన క్రతువు. భక్తులు ఎండ, వానలకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదులు, షెడ్లను నిర్మించనున్నారు. కల్యాణ కట్టలు, మహిళలకు ప్రత్యేక గదులు, టాయిలెట్ల సౌకర్యాలు కల్పించనున్నారు. ఘాట్ల వద్ద బారికేడింగ్ పనులపై దృష్టి సారించారు. రాత్రి వేళల్లో  స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. కాశీ, ప్రయాగ్‌‌‌‌రాజ్ తరహాలోనే ప్రతిరోజూ సాయంత్రం వేళ ‘గోదావరి హారతి’ని వైభవంగా నిర్వహించనున్నారు. హారతి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా దేవాదాయ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, పోలీస్ వంటి 8 ప్రధాన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.