7 హైస్పీడ్ రైళ్లలో 3 తెలంగాణ కే ; కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

7 హైస్పీడ్ రైళ్లలో 3 తెలంగాణ కే ; కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
  •     కేంద్ర బడ్జెట్‌‌లో ఏమివ్వలేదనడం సరికాదు: ప్రహ్లాద్ జోషి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌‌లో తెలంగాణకు ఏమివ్వలేదని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటిస్తే, అందులో మూడు తెలంగాణకే కేటాయించామని వెల్లడించారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ‘వ్యాపారి సంవాద్’ కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమై కేంద్ర బడ్జెట్ విశేషాలను, పన్ను విధానాలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

2047 నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టామని, ఇది భవిష్యత్ తరాల బడ్జెట్ అని జోషి చెప్పారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించినా ఆశించిన అభివృద్ధి జరగలేదు. ప్రపంచంలోనే భారత్‌‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.