- కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ. 5,454 కోట్లు కేటాయించింది: సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్
- 2014 –15తో పోలిస్తే ఈసారి 20 రెట్లు పెరుగుదల
- రాష్ట్రానికి 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చిందన్న రైల్వే జీఎం
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026–27 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు అధిక ప్రాధాన్యత లభించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. నిరుడితో పోలిస్తే ఈసారి కేటాయింపులు పెరగడంతో పాటు అనేక కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి మంజూరయ్యాయని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రానికి 3 బుల్లెట్ ట్రైన్లు రావడం వల్ల రాబోయే రోజుల్లో రైల్వే రవాణా మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడిన తర్వాత సికింద్రాబాద్ రైల్ నిలయంలో మీడియాతో సంజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రానికి 2014–15తో పోలిస్తే ఈసారి 20 రెట్లు కేటాయింపులు పెరిగాయన్నారు. అలాగే, 2025–26 బడ్జెట్‌లో రూ.5,337 కోట్ల కేటాయింపు జరగ్గా, ఈసారి బడ్జెట్‌లో రూ.5,454 కోట్లు కేటాయించారన్నారు. అలాగే, ఏపీకి ఈ బడ్జెట్‌లో రూ.10,134 కోట్ల కేటాయింపులు జరిగినట్టు వెల్లడించారు.
రాష్ట్రానికి 3 బుల్లెట్ట్రైన్లు..
దేశంలోనే అత్యధికంగా తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్లు మంజూరయ్యాయని సంజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్–-చెన్నై, హైదరాబాద్=-బెంగళూరు, హైదరాబాద్ -–పుణె మధ్య ఈ రైళ్లు నడుస్తాయన్నారు. హైదరాబాద్, చెన్నై మధ్య నడిచే బుల్లెట్ ట్రైన్ 2.55 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే, హైదరాబాద్–బెంగళూరుకు 2 గంటల్లో, హైదరాబాద్ –పుణెకు 1.55 గంల్లోనే చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
తెలంగాణలో అన్ని రైల్వే లైన్లను వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తోందని చెప్పారు. 2014-–15 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.258 కోట్ల కేటాయించగా, 2026–-27 దాదాపు 20 రెట్లు అధికంగా రూ.5,454 కోట్లు అలాట్ చేశారని చెప్పారు.
రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి..
తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోందని సంజయ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్లతో చేపట్టిన రైల్వే పనులు పురోగతిలో ఉన్నాయని, ఇందులో కొత్త ట్రాక్ నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి, రైల్వే భద్రత పెంపొందించడం వంటి అనేక పనులు ఉన్నాయని తెలిపారు. రూ.413 కోట్ల వ్యయంతో చర్లపల్లి కొత్త రైల్వే టర్మినల్ నిర్మించామన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 499 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించినట్టు తెలిపారు. 1,242 కిలోమీటర్ల మేర రైల్వే భద్రత వ్యవస్థ (కవచ్)ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
కొత్త రైళ్లు ప్రారంభం..
తెలంగాణకు రైలు అనుసంధానాన్ని సైతం రైల్వే శాఖ మెరుగుపరుస్తోందని, కొత్త టెక్నాలజీ, అధునాతనతో కూడిన కొత్త రైళ్లను నడిపిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 5 వందే భారత్ రైళ్లు, 3 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ నడుస్తున్నాయని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు 1,115 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందని చెప్పారు.
ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా ఏపీలోని నంబూరుకు 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం 2024 అక్టోబర్ 24న ఆమోదం తెలిపిందని, భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి, పాండురంగాపురం మధ్య 173.6 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్రం ఓకే చెప్పిందని వెల్లడించారు.
