మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు..మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ 

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు..మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ 
  • చాచా నెహ్రూ పార్క్​లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక షురూ
  • ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మాసాబ్ ట్యాంక్ లోని చాచా నెహ్రూ పార్క్ లో శుక్రవారం ‘ప్రజా పాలన –- ప్రగతి ప్రణాళిక’  99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.  ఇందులో భాగంగా ఈ -వేస్ట్ సేకరణ కేంద్రాల కియోస్క్ లను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు 99 రోజుల ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’  కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 

ఇండ్లల్లో పాడైపోయిన టీవీలు, ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌లు, కంప్యూటర్లు, ల్యాప్​టాప్‌‌‌‌‌‌‌‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కియోస్క్​కేంద్రాలకు తీసుకువచ్చి రీసైక్లింగ్ చేయాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యులకు రూ.35 కోట్ల జీరో వడ్డీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్​ను ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ముందుకు వస్తే ఆర్టీసీ బస్సులు ఇచ్చి యజమానులను చేస్తామన్నారు. 

తర్వాత 1500 చదరపు గజాల్లో ఏర్పాటు చేసిన అద్దాల లైబ్రరీని ప్రారంభించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ గ్రంథాలయ సమితి చైర్మన్ కె ఉపేందర్ రెడ్డి, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన దాసరి, గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి, అడిషనల్​కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు.

అద్దాల లైబ్రరీ 

పార్కులో లోపల ఏర్పాటు చేసిన అద్దాల లైబ్రరీని గోడలకి బదులుగా అద్దాలతో నిర్మించారు. ఎటు నుంచి చూసినా అద్దాలు మాత్రమే కనబడేలా నిర్మించారు. లోపల అన్ని రకాల పుస్తకాలు,  కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం స్టడీ మెటీరియల్స్​అందుబాటులో ఉంచారు.

ఈ వేస్ట్​కు డిస్కౌంట్ కూపన్లు

వినియోగించని వస్తువులను ఈ -వేస్ట్ సేకరణ కేంద్రాల్లో ఇచ్చిన వారికి గిఫ్ట్ లు, డిస్కౌంట్ కూపన్లు అందిస్తున్నారు. ఇందుకోసం పలు ఎలక్ర్టానిక్ సంస్థలు ముందుకొచ్చాయి. ఇక్కడ ఇచ్చిన కూపన్లతో తిరిగి వస్తువులను కొంటే డిస్కౌంట్ రానుంది. ఈ వేస్ట్ కేంద్రంలో అందించిని వస్తువులను బట్టి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు కూపన్లు ఇస్తున్నారు.