అప్పులు తెచ్చుడు.. భూములు అమ్ముడు..

అప్పులు తెచ్చుడు.. భూములు అమ్ముడు..
  • రాష్ట్ర సర్కారు టార్గెట్ ఇదే!
  • చార్జీల పెంపుపైనా ఫోకస్.. రూ. 2 లక్షల కోట్లతో బడ్జెట్
  • కొత్తగా రూ. 54 వేల కోట్ల అప్పులు తీసుకునే చాన్స్
  • ఇప్పటికే రాష్ట్ర అప్పులు రూ. 3.20 లక్షల కోట్లు దాటినయ్
  • కోకాపేటలోని 100 ఎకరాలు, హౌసింగ్ బోర్డు పరిధిలోని వందలాది ఎకరాల ల్యాండ్ అమ్మకానికి
  • భూముల మార్కెట్ వ్యాల్యూ పెంచేందుకు ఏర్పాట్లు
  • వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల తర్వాత కరెంట్ చార్జీలు పెంపు!

అప్పులు తెచ్చుడు, భూములు అమ్ముడు, చార్జీలు పెంచుడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ను  తయారు చేస్తోంది. ఈసారి బడ్జెట్ అంచనా రూ. 2 లక్షల కోట్లు దాటే చాన్స్ ఉంది. ఇటీవల బడ్జెట్ తయారీపై రివ్యూ జరిపిన సీఎం కేసీఆర్.. బడ్జెట్ అంచనాలు గతంలో కంటే ఎక్కువగా ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. సీఎం సూచనల మేరకు ఫైనాన్స్ ఆఫీసర్లు బడ్జెట్ కు తుది రూపు ఇస్తున్నారు. ఏ మేరకు అప్పులు చేయొచ్చు? ఏయే భూములను అమ్మొచ్చు? ఏ సెక్టార్లో  చార్జీలను పెంచొచ్చు? అనే దానిపై ఫోకస్ పెట్టారు. 

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరిన్ని అప్పులకు సిద్ధమవుతోంది. అదేవిధంగా కోకాపేటలో ఉన్న  100 ఎకరాల భూములను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను అమ్మాలనుకుంటున్నది. వీటికితోడు భూముల మార్కెట్ వ్యాల్యూను, కరెంట్ చార్జీలను పెంచడంపై దృష్టి సారించింది. ఈ నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ఈ మూడు ప్రధానాంశాల చుట్టే తిరగనుంది. నిరుడు 2020–21  బడ్జెట్ ను రూ. 1.82 లక్షల కోట్లతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కరోనా ఎఫెక్ట్ తో ఆ బడ్జెట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అనుకున్న ఆదాయ మార్గాలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనాకు తోడు కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ పేరుతో  నాలుగు నెలలకు పైగా రిజిస్ట్రేషన్లను బంద్ చేయడంతో అసలుకే ఎసరు వచ్చింది. దాదాపు రూ. 50 వేల కోట్లకుపైగా రాబడి తగ్గిందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని 4 నుంచి 5 శాతానికి పెంచటం కొంతమేరకు కలిసి వచ్చింది.
అదనంగా రూ.  20 వేల కోట్ల అప్పు తీసుకునే అవకాశం దక్కింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43,937 కోట్ల అప్పులు తీసుకుంది. మార్చి నెల ముగిసే సరికి అది రూ. 50 వేల కోట్లకు చేరనుంది. దీంతో అనుకున్న ఆదాయం రాకున్నా అప్పులతోనే ఈ ఏడాది గట్టెక్కినట్లయిందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

అప్పులే అప్పులు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులన్నీ కలిపి రూ. 3.20 లక్షల కోట్లు దాటింది. ఏటా ప్రభుత్వం అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఇప్పటివరకు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సిందేనని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు రూ. 54 వేల కోట్ల వరకు అప్పులు చేసే అవకాశం ఉందని ఫైనాన్స్ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర అప్పులు దాదాపు రూ. 4 లక్షల కోట్ల వరకు చేరొచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. 2014–-15 ఆర్థిక సంవత్సరంలో అప్పులు రూ. 79,880 కోట్లు ఉండగా.. కిస్తీల కింద  రూ. 5,593 కోట్లు చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిస్తీల భారం రూ. 17 వేల కోట్లకు చేరుకుంది.  

భూములు అమ్మితే.. రూ. 20 వేల కోట్లు!
రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ భూములను అమ్మాలని రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. ఎప్పటి నుంచో హెచ్ఎండీఏ పరిధిలోని కోకాపేటలో ఉన్న దాదాపు 100 ఎకరాల భూములను అమ్మాలనుకుంటున్నా కోర్టుల్లో కేసులు పడటంతో బ్రేకులు పడ్డాయి. ఆ భూములు ప్రభుత్వానివే అని గతేడాది కోర్టు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. కానీ కరోనా, లాక్ డౌన్తో భూముల వేలం ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటడంతో భూములను అమ్మేందుకు సర్కారు సిద్ధమైందని ఆఫీసర్లు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో విలువైన వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. అందులో హైదరాబాద్ శివారులోని భూములకు మంచి డిమాండ్ ఉంది. అటు హెచ్ఎండీఏ.. ఇటు హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను అమ్మి దాదాపు రూ. 20 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

కరెంట్ చార్జీలు పెంచే చాన్స్
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంట్ చార్జీలను పెంచే అవకాశం ఉంది. అయితే.. బడ్జెట్  అమలులోకి వచ్చిన వెంటనే ఈ పెంపు ఉండకపోవచ్చని ఆఫీసర్లు అంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు తర్వాత  వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే  విద్యుత్ చార్జీలను పెంచే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి గత ఏడాదే  కరెంట్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావించింది. సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ఈలోపే కరోనా రావడం, లాక్ డౌన్ విధించడంతో చార్జీల పెంపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది.  

రిజిస్ట్రేషన్ల ఫీజుతో మరింత గుంజే ప్లాన్
ఈ బడ్జెట్లో భూముల మార్కెట్ వ్యాల్యూను పెంచేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 లో భూముల ధరలను సవరించారు. అప్పట్నుంచి అవే ధరలు అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ ను అమలు చేసే సమయంలోనే భూముల మార్కెట్ వ్యాల్యూను సవరించాలని ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ధరల పెంపు ఆలోచనను వాయిదా వేసింది. కానీ 2021–-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం భూముల మార్కెట్ వ్యాల్యూను పెంచనున్నట్లు తెలిసింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగు తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెల సగటున రూ. 700 కోట్ల ఆదాయం వస్తోంది. అయితే.. ప్రతినెలా మరో 50 శాతం అదనపు ఆదాయం వచ్చేలా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూముల మార్కెట్ వ్యాల్యూను సవరించే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు.