సమ్మె చేసినందుకు జీతం కట్.. పంచాయతీ సెక్రటరీల శాలరీల్లో కోత పెట్టిన సర్కార్

సమ్మె చేసినందుకు జీతం కట్.. పంచాయతీ సెక్రటరీల శాలరీల్లో కోత పెట్టిన సర్కార్
  • 17 రోజుల సమ్మె కాలానికి రూ.15 వేలు కటింగ్ 
  • ఏప్రిల్ జీతంలో మూడ్రోజులు, మే జీతంలో 14 రోజులు కోత 
  • రెగ్యులరైజ్ చేయకపోగా జీతం కట్ చేయడంపై జేపీఎస్​ల ఆవేదన 

ఆసిఫాబాద్, వెలుగు:  సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేసినందుకు జూనియర్ పంచాయతీ సెక్రటరీల జీతాల్లో సర్కార్ కోత పెట్టింది. ఏప్రిల్, మే నెలల్లో జేపీఎస్ లు 17 రోజుల పాటు సమ్మె చేయగా.. ఆ 17 రోజుల జీతాన్ని కట్ చేసింది. జేపీఎస్ లు సమ్మె చేశారని మేలో ఇవ్వాల్సిన ఏప్రిల్ జీతాన్ని ఆపేసిన సర్కార్.. బుధవారం రెండు నెలల జీతం విడుదల చేసింది. అయితే ఏప్రిల్ జీతంలో మూడ్రోజులు కటింగ్ పెట్టగా.. మే జీతంలో 14 రోజులు కటింగ్ పెట్టింది. జేపీఎస్ ల జీతం రూ.28,719 కాగా.. ఏప్రిల్ జీతంలో మూడ్రోజులకు రూ.2,880 కట్ చేసి అకౌంట్లలో రూ.25,839 జమ చేసింది. 

ఇక మే జీతానికి సంబంధించి 14 రోజులకు గాను రూ.12,051 కట్ చేసి, ఉద్యోగుల ఖాతాల్లో రూ.16,668 జమ చేసింది. కాగా, ప్రొబేషన్ పీరియడ్ ముగిసినా రెగ్యులరైజ్ చేయకపోవడంతోనే జేపీఎస్ లు సమ్మెకు దిగారు. అయితే సర్కార్ తో చర్చల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. దశాబ్ది ఉత్సవాల్లో అన్నీ తామై పని చేశారు. కానీ చివరకు సర్కార్ జీతం కట్ చేయడంతో జేపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది మాకు దశాబ్ది ఉత్సవాల ముగింపు గిఫ్టా?” అని వాపోతున్నారు. 

డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చి.. 

2019 ఏప్రిల్ 12న జూనియర్​పంచాయతీ సెక్రటరీలు విధుల్లో చేరారు. మూడేండ్ల ప్రొబేషన్ తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే తర్వాత ప్రొబేషన్ ను మరో ఏడాది పొడిగించింది. అది కూడా 2023 ఏప్రిల్ 11నాటికి ముగిసింది. అయినప్పటికీ రెగ్యులరైజేషన్​పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 28 నుంచి జేపీఎస్ లు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8వేల మందికి పైగా జేపీఎస్​లు మే 14 వరకు సమ్మె కొనసాగించారు. 17 రోజుల పాటు సమ్మె చేసినా సర్కార్ నుంచి సరైన స్పందన రాలేదు. విధుల్లో చేరాలని లేదంటే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. చివరకు ఆయన జేపీఎస్ లను చర్చలకు ఆహ్వానించారు. ఆయనిచ్చిన హామీతో జేపీఎస్ లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. 

కానీ ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ పై సర్కార్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ‘‘ప్రభుత్వం మా డిమాండ్లకు ఒప్పుకోవడంతోనే సమ్మె విరమించినం. కానీ ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా మా జీతాలు కట్ చేశారు. ఇది నమ్మించి మోసం చేయడమే” అని జేపీఎస్ లు మండిపడుతున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో రాత్రీపగలు తేడా లేకుండా పని చేశామని, తమను అభినందించాల్సిపోయి జీతం కట్ చేయడం దారుణమని ఫైర్ అవుతున్నారు.

మొత్తం జీతం ఇయ్యాలె..

మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయలేదు. మా న్యాయమైన డిమాండ్ల కోసం చేసినం. అవి నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే తిరిగి విధుల్లో చేరినం. కానీ ఇప్పుడు ఇట్ల జీతం కట్ చేయడం దారుణం. ఇంతకుముందు ఎంతోమంది సమ్మె చేశారు. ఎప్పుడిట్ల జీతాలు కట్ చేయలేదు. మా జీతం మొత్తం చెల్లించాలె. 

- కె.కృష్ణ, జేపీఎస్​ల సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు