హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించిన ప్రభుత్వం, తాజాగా ఆ గడువు ముగియడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై తక్షణమే నిషేధం విధిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని విభాగాలకు మినహాయింపులు ఇచ్చింది. పదోన్నతులు పొందిన వారికి, పోస్టుల రద్దు అయినప్పుడు, క్రమశిక్షణా చర్యల సందర్భంలో, ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సుదీర్ఘ సెలవు ముగించుకుని తిరిగి వచ్చే వారికి ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.
అయితే, ఆరు నెలల లోపు సెలవుల వల్ల ఏర్పడే ఖాళీలను మాత్రం బదిలీల ద్వారా భర్తీ చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే ఆరు నెలల వరకు బదిలీల సడలింపు కోసం ఎటువంటి ప్రతిపాదనలను పంపకూడదని, ఒకవేళ అత్యవసరమైతే సీఎం స్థాయి వరకు ఫైలు వెళ్లాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలను అతిక్రమించి బదిలీలు చేపడితే సదరు ఉద్యోగుల జీతాల బిల్లులను నిలిపివేయాలని ట్రెజరీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
